తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు.. మరింత పటిష్టంగా ఆ వ్యవస్థ

by Gantepaka Srikanth |

తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు.. మరింత పటిష్టంగా ఆ వ్యవస్థ

తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు.. మరింత పటిష్టంగా ఆ వ్యవస్థ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర విద్యుత్ రంగాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేయడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 25న జరుగనున్న కేబినెట్ సమావేశంలో విద్యుత్ రంగంపై ప్రత్యేక ఎజెండాతో విస్తృత చర్చ జరగనుంది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, బొగ్గు వ్యయం, డిస్కంల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొత్త థర్మల్ ప్లాంట్ల నిర్మాణం, కొత్త డిస్కమ్ ఏర్పాటు, విద్యుత్ సంస్థల అప్పుల సమీక్ష, విద్యుత్ చార్జీల పెంపు, గ్రేటర్ హైదరాబాద్‌లో భూగర్భ కేబుల్ వ్యవస్థ అమలు వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

కొత్త థర్మల్ ప్రాజెక్టులపై దృష్టి

రాష్ట్రంలో విద్యుత్ వినియోగం నిరంతరం పెరుగుతోంది. ప్రస్తుతానికి 17-18 వేల మెగావాట్ల పీక్ డిమాండ్ ఉన్నా... రాబోయే సంవత్సరాల్లో ఈ అవసరం 19 వేల మెగావాట్లు దాటే అవకాశం ఉంది. 2030 నాటికి 24 వేల మెగావాట్లను చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి ఆపరేషన్, రామగుండం వద్ద సూపర్ క్రిటికల్ యూనిట్ల ఏర్పాటు, అవసరమైతే మరో కొత్త ప్లాంట్‌కు ప్రాథమిక పరిశీలన లాంటి అంశాలను పరిశీలించనుంది.

డిస్కమ్‌ల ఆర్థిక సంక్షోభం

ఇటీవలి సంవత్సరాల్లో విద్యుత్ సంస్థలకు భారీ నష్టాలు పేరుకుపోయాయి. సింగరేణి బొగ్గు ధరలు, ఇంధన వ్యయం పెరగడం, కొనుగోలు ఖర్చులు పెరగడం సంస్థలపై ఆర్థిక భారం పెంచాయి. కేబినెట్‌లో కింది అంశాలు చర్చకు వచ్చే అవకాశం కీలకంగా ఉంది. జెన్ కో ట్రాన్స్ కో, డిస్కంల అప్పుల పునర్వ్యవస్థీకరణ, తదితర అంశాలపై చర్చిస్తారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో భూగర్భ కేబుల్ వ్యవస్థ

హైదరాబాద్‌‌లో పెరుగుతున్న లోడ్ డిమాండ్‌, సేఫ్టీ సమస్యలు, వర్షాకాలంలో విద్యుత్ అంతరాయాల నివారణ కోసం జీహెచ్ఎంసీ పరిధిలో భూగర్భ కేబుల్ అమలును దశల వారీగా చేపట్టే ప్రణాళికను సిద్ధం చేశారు. దీనిపై నిధుల కేటాయింపులు, డీపీఆర్ తయారీ వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఇంధన పాలసీపై చర్చ

కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఇంధన విధానంపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా పునరుద్ధరణీయ ఇంధన ప్రణాళికలు, గ్రిడ్ బలోపేతంపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గ్రీన్ ఎనర్జీ, బ్యాటరీ నిల్వ ప్రాజెక్టులు, ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణకు విధాన మార్పులు చర్చకు రానున్నాయి. నూతన ఇంధన వనరుల ప్రోత్సాహం (సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్)పైనా ప్రధానంగానే చర్చించనున్నట్లు తెలుస్తోంది.

విద్యుత్ చార్జీల పెంపుపై నిర్ణయం?

డిస్కంల ఆర్థిక స్థితి క్షీణించిన నేపథ్యంలో, వినియోగదారులపై చార్జీల సవరణను ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అయితే విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకోవడం ఎందుకనే భావనలో ప్రభుత్వం ఉందని భావిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కరెంటు బిల్లుల పెంపు అనేది అంత ఈజీ కాదని భావిస్తున్నారు.

Next Story