- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సనత్‌నగర్ టిమ్స్ అంచనా వ్యయం పెంపు
సనత్‌నగర్ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ప్రభుత్వం పెంచింది.

- రూ.957 కోట్లకు పెంచుతూ సర్కారు నిర్ణయం
- అదనపు హంగులు, అధునాతన వైద్య పరికరాల కోసమేనన్న సర్కారు
దిశ, తెలంగాణ బ్యూరో : సనత్‌నగర్ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ప్రభుత్వం పెంచింది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రిలో మరిన్ని అదనపు హంగులు, అధునాతన వైద్య పరికరాలు సమకూర్చాల్సి రావడంతో నిర్మాణ వ్యయం పెరిగిందని సర్కారు వెల్లడించింది. ఈ ప్రాజెక్టు కోసం మొదట కేటాయించిన రూ.882 కోట్లను సవరిస్తూ.. రూ.957 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం సవరించిన పరిపాలనా అనుమతులిచ్చింది. నిర్మాణ సంస్థ అయిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాజెక్టు వ్యయం పెరగడం వెనుక పలు సాంకేతిక కారణాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రోగులకు అంతర్జాతీయ స్థాయి వైద్యం అందించేందుకు వీలుగా అత్యంత అధునాతన మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను ఇందులో పొందుపరుస్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవ అవసరాలను బట్టి ఆసుపత్రి భవన విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు ప్రాజెక్టు మధ్యలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచడం కూడా అంచనా వ్యయం పెరగడానికి మరో ముఖ్య కారణంగా అధికారులు వెల్లడించారు. ఈ కారణాల రీత్యా ప్రాజెక్టు గడువును కూడా ఈ ఏడాది జూన్ 8వ తేదీ వరకు పొడిగించారు.
ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే 83శాతం పనులు
గత ప్రభుత్వ హయాంలో నెమ్మదించిన టిమ్స్ పనులు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రికార్డు స్థాయిలో వేగం పుంజుకున్నాయి. ఫిబ్రవరి 2.2023 నుండి డిసెంబర్ 7.2023 వరకు రూ. 120.89 కోట్లు ఖర్చు చేసి కేవలం 13.14శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో డిసెంబర్ 8, 2023 నుండి ఇప్పటి వరకు రూ. 771.02 కోట్లు ఖర్చు చేయగా... పనులు చివరి దశఖు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 97 శాతం పనులు పూర్తి కాగా... జూన్ నెలలో ప్రారంభానికి ముస్తాబు అవుతోంది. ఇప్పటికే ట్రయల్ రన్ లో భాగంగా ఓపీ సేవలు అందుతున్నాయి. ఆసుపత్రిలోని మొత్తం 37 విభాగాలకు గాను.. ఇప్పటికే 22 విభాగాల్లో ఓపీ సేవలను అందిస్తున్నారు. జూన్ నెలలో పూర్తి స్థాయి ఆసుపత్రి సేవలు అందుబాటులోకి వస్తే నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల జిల్లాల పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందనుంది.






