TG: లొంగిపోయిన మావోయిస్టులకు ఉద్యోగాలు, స్పెషల్‌ డ్రెస్‌లు

by Gantepaka Srikanth |

జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

TG: లొంగిపోయిన మావోయిస్టులకు ఉద్యోగాలు, స్పెషల్‌ డ్రెస్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లొంగిపోయిన మావోయిస్టులను పర్యాటక మార్గదర్శకులుగా (Tourism Guides) నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. మొత్తం 20 మంది మాజీ మావోయిస్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపట్లో నియామక పత్రాలను అందజేయనున్నారు. వీరికి విధుల సమయంలో ధరించడానికి ప్రభుత్వం ప్రత్యేక యూనిఫాంను కూడా కేటాయించింది. వీరంతా ప్రధానంగా పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భద్రాచలం, ములుగు జిల్లాల్లో గైడ్స్‌గా విధులు నిర్వహించనున్నారు. కేవలం పర్యాటక ప్రదేశాలే కాకుండా, ప్రముఖ దేవాలయాల్లో కూడా వీరు మార్గదర్శకులుగా సేవలందించనున్నారు. ఈ ఉద్యోగాల కోసం వీరికి నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) మరియు పర్యాటక శాఖ సంయుక్తంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాయి.

పునరావాసంలో సరికొత్త అడుగు..

మావోయిస్టులుగా అడవుల్లో గడిపిన సమయంలో ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులపై వారికి ఉన్న అపారమైన అవగాహనను పర్యాటక రంగానికి ఉపయోగించుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. అడవుల గురించి, అక్కడి దారుల గురించి వారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా అడవిని వీడి వచ్చిన వారికి సమాజంలో మంచి గుర్తింపు, ఉపాధి లభించడమే కాకుండా, పర్యాటకులకు కూడా అడవుల గురించి లోతైన సమాచారం అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Next Story