సిగాచి ఘటన.. ఇండస్ట్రియల్ డిజాస్టర్ టీమ్‌ ఏర్పాటుకు సీఎం ఆదేశం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-05 02:36:11  IST  )

రాష్ట్రంలో కొత్తగా ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

సిగాచి ఘటన.. ఇండస్ట్రియల్ డిజాస్టర్ టీమ్‌ ఏర్పాటుకు సీఎం ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొత్తగా ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రతి పారిశ్రామిక వాడల్లో ఈ ఫోర్స్‌కు సంబంధించిన ఓ బృందాన్ని అపాయింట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. ఇటీవల సంగారెడ్డి జిల్లా సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే. అదే డిజాస్టర్ ఫోర్స్ అందుబాటులో ఉంటే తక్కువ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనితో స్టేట్‌లో ఇండస్ట్రియల్ డిజాస్టర్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తున్నది. నిజానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మేంట్ యాక్ట్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో పరిశ్రమలు ఉన్న ఏరియాల్లో ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నాయి.

వెంటనే రంగంలోకి డిజాస్టర్ ఫోర్స్

ప్రస్తుతం అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు సహాయ చర్యలు చేపట్టేందుకు అగ్నిమాపక శాఖ మాత్రమే పనిచేస్తున్నది. ఇదే శాఖకు చెందిన సిబ్బంది పారిశ్రామిక వాడల్లో జరిగే ప్రమాదాలు,పేలుళ్లను నివారించలేకపోతున్నారు. ఎందుకంటే రసాయనాల మిశ్రమాల వల్ల జరిగే పేలుళ్లను కంట్రోల్ చేయడానికి కేవలం నీళ్లు మాత్రమే సరిపోవు. కొన్ని రకాలైన కెమికల్స్‌ను ఉపయోగించి మంటలను వెంటనే అదుపులోకి తీసుకొచ్చే చాన్స్ ఉంది. అందుకని ప్రతి ఇండస్ట్రీయల్ జోన్‌లో డిజాస్టర్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం పోలీసు, అగ్నిమాపక, హైడ్రా విభాగాల నుంచి ఎంపిక చేసిన బృందాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ టీమ్స్‌ను రసాయన పరిశ్రమలు అధికంగా ఉన్న ఏరియాల్లో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

స్టేట్ డిజాస్టర్ అథారిటీ ఎక్కడ?

రాష్ట్రంలో ఇంతవరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయలేదని ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి. కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేసి, తరువాత ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. డిజాస్టర్ అథారిటీ ఉంటే, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో సలహాలు, సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికైన ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని పరిశ్రమల నిపుణులు సూచిస్తున్నారు.

Next Story