తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం

by Prasad Jukanti |   (  Updated:2026-04-21 08:44:02  IST  )

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది.

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం బదిలీల ప్రక్రియ 1 మే 2026 నుండి మే 31, 2026 వరకు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 1, 2026 నుండి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని పేర్కొంది. 1 జనవరి 2026 నాటికి ఒకే చోట మూడేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీకి అర్హులుగా పేర్కొంది అయితే నాలుగేళ్లు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది.

వీరికి మినహాయింపు:

మే 31, 2027 లోపు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులను వారి అభ్యర్థన లేనిదే బదిలీ చేయరుని, జీవిత భాగస్వామి (Spouse) ఆధారంగా కోరుకునే బదిలీలకు మూడేళ్ల నిబంధన వర్తించదని స్పష్టం చేశారు. ఏ ఒక్క క్యాడర్‌లో కూడా 40 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను బదిలీ చేయకూడదని పేర్కొంది. బదిలీల ప్రక్రియ మొత్తం కౌన్సెలింగ్ పద్ధతిలో సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్/వెబ్ ఆధారిత అప్లికేషన్ ద్వారా పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే బదిలీల సమయంలో భార్యాభర్తలు (ఒకరికి మాత్రమే), పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారు, 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు, మానసిక వికలాంగులైన పిల్లలున్న తల్లిదండ్రులు, వితంతువులు, క్యాన్సర్, కిడ్నీ, లివర్ మార్పిడి వంటి తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. బదిలీల ప్రక్రియను పర్యవేక్షించడానికి క్యాడర్ వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తు్న్నట్లు ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. స్టేట్, మల్టీ-జోనల్/జోనల్, జిల్లా స్థాయిల్లో అధికారుల నేతృత్వంలో ఈ కమిటీలు పని చేయనున్నాయి.

బదిలీ షెడ్యూల్ వివరాలు:

మే 1 - 7: బదిలీల విధివిధానాల ఖరారు. ఖాళీ పోస్టులు మరియు తప్పనిసరిగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల జాబితా సిద్ధం చేసి ప్రచురించడం

మే 8- 15: ఉద్యోగులు తమకు కావలసిన బదిలీ ప్రాంతాల కోసం ఆప్షన్లను (Options) సమర్పించవలసి ఉంటుంది

మే 16- 24: సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి బదిలీ విధానం ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అనంతరం మాస్టర్ లిస్ట్‌ను సిద్ధం చేస్తారు.

మే 25-31: బదిలీ ఉత్తర్వులను జారీ

బదిలీ ఉత్తర్వులు వెలువడిన 3 రోజుల్లోపు ఉద్యోగులు విధుల నుండి రిలీవ్ కావాలని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సీరియస్‌గా తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. సెన్సస్ (జనాభా గణన) సంబంధిత పనుల్లో ఉన్న ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Next Story