తెలుగు చిత్ర పరిశ్రమకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..

by Gantepaka Srikanth |

తెలంగాణలో సినిమా నిర్మాణం, థియేటర్ల నిర్వహణకు సంబంధించిన అన్ని అనుమతులను ఒకేచోట పొందేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తోందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్ డీసీ) చైర్మన్ దిల్‌రాజు తెలిపారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..
X

దిశ, తెలంగాణబ్యూరో: తెలంగాణలో సినిమా నిర్మాణం, థియేటర్ల నిర్వహణకు సంబంధించిన అన్ని అనుమతులను ఒకేచోట పొందేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తోందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్ డీసీ) చైర్మన్ దిల్‌రాజు తెలిపారు. ఈ సులభతర అనుమతులపై రూపొందిస్తున్న ప్రత్యేక వెబ్‌సైట్‌ 'ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ'పై సోమవారం బేగంపేట్‌లోని టూరిజం ప్లాజాలో జరిగిన ఒక వర్క్‌షాప్‌లో దిల్‌రాజు ఈ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్.డీ.సీ మేనేజింగ్ డైరెక్టర్ సీ.హెచ్. ప్రియాంక, టూరిజం కార్పొరేషన్ ఎం.డీ వల్లూరు క్రాంతి, పలు శాఖల ఉన్నతాధికారులు, సినీ పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు.

కొత్తగా రూపొందిస్తున్న వెబ్‌సైట్ జాతీయ, అంతర్జాతీయ సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్‌తో వస్తే, వారికి కావాల్సిన షూటింగ్ లొకేషన్లు, వివిధ శాఖల నుంచి అనుమతులు, సాంకేతిక నిపుణులు, హోటల్స్ వంటి పూర్తి సమాచారాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి సౌకర్యం దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో మాత్రమే అందుబాటులోకి వస్తోందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, సినిమా థియేటర్లకు సంబంధించిన 'బీ-ఫామ్' జారీ ప్రక్రియను కూడా ఆన్‌లైన్ ద్వారా సులభతరం చేయనున్నట్లు దిల్‌రాజు తెలిపారు. ప్రస్తుతం ఈ అనుమతులు పోలీసు కమిషనర్లు లేదా అడిషనల్ కలెక్టర్లు జారీ చేస్తున్నారు. ఇకపై ఈ అనుమతులు కూడా ఆన్‌లైన్‌లో పొందేలా రాష్ట్ర హోం శాఖతో చర్చించి విధానాలు రూపొందించబడుతాయని చెప్పారు. ఈ వెబ్‌సైట్ రూపకల్పనపై సినీ పరిశ్రమ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారుల నుంచి సూచనలు, సలహాలు కోరారు. ఈ వెబ్‌సైట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Next Story