- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGGDA: యూనివర్సిటీ పరీక్షల రెమ్యునరేషన్ పెంచాలి
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) పరిధిలో మెడికల్ టీచింగ్ ఫ్యాకల్టీకి చెల్లిస్తున్న పరీక్షల రెమ్యునరేషన్‌ను తక్షణమే సవరించాలని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం (టీజీజీడీఏ) డిమాండ్ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) పరిధిలో మెడికల్ టీచింగ్ ఫ్యాకల్టీకి చెల్లిస్తున్న పరీక్షల రెమ్యునరేషన్‌ను తక్షణమే సవరించాలని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం (టీజీజీడీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కే. రమేష్ రెడ్డిని కలిసి సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. 2018లో నిర్ణయించిన ధరల ప్రకారమే ప్రస్తుతం రెమ్యునరేషన్ చెల్లిస్తున్నారని, గత ఎనిమిదేళ్లుగా ఎలాంటి పెంపు లేకపోవడం సరికాదని పేర్కొన్నారు. పెరిగిన పనిభారం, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఇతర రాష్ట్రాల్లోని హెల్త్ యూనివర్సిటీలు ఇప్పటికే రెమ్యునరేషన్‌ను పెంచాయని గుర్తుచేశారు. సూపర్ స్పెషాలిటీ, పీజీ, యూజీ థియరీ, ప్రాక్టికల్ పరీక్షల రెమ్యునరేషన్‌ను పెంచాలని కోరారు.
పేపర్ సెట్టింగ్, వాల్యూయేషన్, ఇన్విజిలేషన్, ఎక్స్‌టర్నల్, ఇంటర్నల్ ఎగ్జామినర్ విధులకు ఇచ్చే అలవెన్సులను ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల స్థాయికి పెంచాలన్నారు. ఎగ్జామినర్ల నియామకంలో ఎన్ఎంసీ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. బోధనా సిబ్బంది విద్యా ప్రమాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి తగిన ప్రోత్సాహం అందించాలని వీసీని కోరారు. దీనిపై వీసీ సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షులు డా. బి. నరహరి, ప్రధాన కార్యదర్శి డా. ఆర్. లాలు ప్రసాద్ రాథోడ్, కోశాధికారి డా. మొహమ్మద్ ఖాజా రౌఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.






