తెలంగాణలోని అటవీ శాఖకు ఐఎఫ్ఎస్‌‌ల కొరత

by Malleboina Mahesh |

అటవీ శాఖలో ఉన్నతాధికారుల కొరత వెంటాడుతోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారులు సరియైన సంఖ్యలో లేకపోవడంతో అటవీ శాఖలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తుంది.

తెలంగాణలోని అటవీ శాఖకు ఐఎఫ్ఎస్‌‌ల కొరత
X

దిశ, తెలంగాణ బ్యూరో: అటవీ శాఖలో ఉన్నతాధికారుల కొరత వెంటాడుతోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారులు సరియైన సంఖ్యలో లేకపోవడంతో అటవీ శాఖలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తుంది. రాష్ట్రానికి 81 మంది ఐఎఫ్ఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. అయితే ఇవి కేటాయింపులుగానే మిగులుతున్నాయి. వీటి సంఖ్యకు అనుగుణంగా గత పుష్కర కాలంలో ఏనాడు కేంద్రం కేటాయింపులు చేయలేదు. కొత్త బ్యాచ్ లు వచ్చినా అంతంత మాత్రంగానే కేటాయింపులు చేస్తుంది. తెలంగాణకు కేటాయించిన 81 మంది ఐఎఫ్ఎస్ అధికారుల్లో ప్రస్తుతం 52 మంది మాత్రమే పనిచేస్తున్నారు.

వీరిలో కూడా కొందరు అధికారులు ప్రస్తుతం కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ పై వెళ్లారు. మరికొందరు రాష్ట్రంలోని ఇతర శాఖలకు డిప్యూటేషన్పై వెళ్లారు. రాష్ట్రంలో అంతగా ప్రాముఖ్యత లేని పోస్టింగ్లు వచ్చినప్పుడు ఐఎఫ్ఎస్ అధికారులు తమకున్న ఉన్నత పరిచయాలతో ముఖ్యమైన శాఖల్లోకి డిప్యూటేషన్ పై వెళ్తున్నారు. జిల్లాలో పని చేసినప్పుడు వివిధ కారణాలతో హైదరాబాద్ లో ఉండాలనుకునేవారు ఇతర శాఖల్లోకి వెళ్లి పోస్టింగ్లు తెచ్చుకుంటున్నారు. అటవీ శాఖలో మారుమూల అటవీ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. అడవులను నరికి వేయకుండా, అక్రమ రవాణా జరగకుండా, అటవీ విస్తీర్ణం కాపాడే విధంగా, అభయారణ్యంలో జంతువుల పరిరక్షణ చేపట్టాల్సి ఉంటుంది.

ప్రభుత్వం చేపట్టే మొక్కల పెంపకం, పరిశోధన, శిక్షణ అంశాలపై ఉన్నతాధికారులు నిత్య పర్యవేక్షణ అవసరం. ఉన్నతాధికారుల సంఖ్యనే తక్కువగా ఉండటంతో ఉన్న కింది స్థాయి అధికారులనే పెద్ద పోస్టుల్లో ఇంఛార్జిలుగా నియమిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఖాళీ అవుతున్న సంఖ్యలో కేటాయింపులు ఉండటం లేదు. ఇప్పటికే ఉన్న ఖాళీలను భర్తీ చేసే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదు. కేంద్రం నుంచి తక్కువగా కేటాయింపులు ఉంటే తాము ఎవరికి చెప్పుకోవాలని అటవీ శాఖ ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుకున్నంత సంఖ్యలో కూడా కేంద్రం నుంచి కేటాయింపులు చేయడం లేదని వారు చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ ఖాళీలను భర్తీ చేయాలనే లక్ష్యంతో ఉంటే వాటి భర్తీ సులువు అవుతుందని చెబుతున్నారు. తెలంగాణలోనే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఐఎఫ్ఎస్ అధికారుల కొరత ఉందని అంటున్నారు. కొరతను కొంత తగ్గించుకోవడానికి రాష్ట్రంలో ఇతర శాఖల్లోకి డిప్యూటేషన్ పై వెళ్లిన వారిని అటవీ శాఖకు తిరిగి రప్పించుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల ద్వారా అటవీ శాఖలో ఉన్న వాస్తవ పరిస్థితులను వారికి వివరించి ఐఎఫ్ఎస్ అధికారుల డిప్యూటేషన్లు రద్దు చేసి తమ శాఖకు కేటాయించాలని కోరుతున్నారు.

Next Story