- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రేవంత్ రెడ్డి అదృశ్యమయ్యారు’.. సీఎం విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారం.. ఫ్యాక్ట్ చెక్ అధికారిక వివరణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా @FactCheck_TG ఫ్యాక్ట్ చెక్ ఖాతా నుంచి అధికారిక వివరణతో స్పష్టం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా @FactCheck_TG ఫ్యాక్ట్ చెక్ ఖాతా నుంచి అధికారిక వివరణతో స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి అధికారిక విదేశీ పర్యటనకు సంబంధించి, ఆయన ‘అదృశ్యమయ్యారు’, అలాగే ఎటువంటి అధికారిక సమాచారం లేకుండా ఆయన వ్యక్తిగత పర్యటన పై వెళ్లారని సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేశారని వెల్లడించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, దురుద్దేశపూర్వకంగా చేసిన ప్రచారమేనని పేర్కొంది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా ముఖ్యమంత్రి అధికారికంగా ఆమోదించిన పర్యటనకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరించి, ప్రజలను తప్పుదారి పట్టించి గందరగోళం సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం ఇదని తెలిపింది.
MEA ఏర్పాటు చేసిన రోడ్డు ప్రయాణం
ముఖ్యమంత్రి న్యూయార్క్ పర్యటన పూర్తిగా అధికారికమేనని. అన్ని విధి విధానాలకు అనుగుణంగా సమన్వయంతో నిర్వహించినట్లు తెలిపారు. ‘ముఖ్యమంత్రి విదేశీ పర్యటనను ముందుగానే అధికారికంగా తెలియజేసి, నిబంధనల ప్రకారమే నిర్వహించారు. విదేశీ పర్యటనకు అవసరమైన అన్ని అనుమతులను ముందుగానే కేంద్ర ప్రభుత్వం నుంచి పొందారు. దావోస్ నుంచి అమెరికా చేరుకున్న అనంతరం, న్యూయార్క్ విమానాశ్రయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికారులు ముఖ్యమంత్రిని స్వాగతించారు. న్యూయార్క్ లో ముఖ్యమంత్రి ప్రయాణానికి MEA అధికారిక వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఇది సాధారణ దౌత్య విధానాల్లో భాగమే. శీతాకాలంలో తీవ్ర మంచు తుఫాన్ల కురిసే హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో విమాన ప్రయాణం చేయవద్దని MEA ముఖ్యమంత్రిని ఆదేశించింది. వారి తదుపరి ప్రయాణాన్ని రోడ్డు మార్గంలో చేపట్టాలని తెలియజేసింది. MEA సూచనల మేరకు, బోస్టన్ వరకు రోడ్డు మార్గంలో ప్రయాణాన్ని MEAనే ఏర్పాటు చేసింది. ఇందులో హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్ వరకు ముఖ్యమంత్రి ప్రయాణం కూడా ఉంది. ఉన్నత స్థాయి విద్యా సంస్థ నిర్దేశించిన కార్యక్రమాల పై పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉండటంతో, ఈ కాలంలో ఉద్దేశ్య పూర్వకంగానే ముఖ్యమంత్రి తన కార్యక్రమాలను నిరాడంబరంగా ఉంచారు’ అని పేర్కొంది.
సోషల్ మీడియాలో ప్రచారం
‘సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమైనవి, బాధ్యతారహితమైనవి, అలాగే ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రమే. దయ చేసి ప్రజలు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. అలాగే అధికారులు చేసే ప్రకటనలను పరిశీలించండి’ అని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ ఒక ప్రకటన విడుదల చేసింది.






