మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై తప్పుడు ప్రచారం! తెలంగాణ ఫ్యాక్ట్ చెక్

by Ramesh Naini |   (  Updated:2026-01-06 11:07:10  IST  )

తెలంగాణ ప్రభుత్వం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించిన 50 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని యోచిస్తోందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై తప్పుడు ప్రచారం! తెలంగాణ ఫ్యాక్ట్ చెక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించిన 50 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని యోచిస్తోందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వార్త పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనది, దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేయబడిందని మంగళవారం ఎక్స్ వేదికగా తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని పలు సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు భూముల వినియోగంపై నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ భూములను కేటాయించిన సంస్థలు వాటిని ఏ విధంగా వినియోగిస్తున్నాయనే అంశంపై వివరాలు సేకరించడం ఈ నోటీసుల ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

ఇది ప్రతి సంవత్సరం జరిగే ఒక సాధారణ ప్రక్రియ

ఇది ప్రతి సంవత్సరం జరిగే ఒక సాధారణ ప్రక్రియ మాత్రమేనని స్పష్టం చేశారు. 2024 సంవత్సరంలో జిల్లా కలెక్టర్, మండల రెవెన్యూ అధికారి, తహశీల్దార్ అధ్యక్షతన ఒక ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కమిటీ ప్రభుత్వ భూములు ప్రజాసేవ కోసం సమర్థవంతంగా వినియోగంలో ఉన్నాయా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తుందని చెప్పారు. గత కొన్ని ఏళ్లుగా ప్రభుత్వం ప్రజాప్రయోజనాల నిమిత్తం అనేక సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు భూములను కేటాయించిందని, ఆ ప్రక్రియలో భాగంగా ఆయా భూముల వినియోగంపై వివరాలు కోరుతూ నోటీసులు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.

నోటీసులు అందుకున్న సంస్థల్లో ఉర్దూ వర్సిటీ ఒకటి

నోటీసులు అందుకున్న సంస్థల్లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కూడా ఒకటని తెలిపారు. ప్రభుత్వం యూనివర్సిటీకి మొత్తం 200 ఎకరాల భూమిని కేటాయించగా, ప్రస్తుతం 150 ఎకరాలు మాత్రమే వినియోగంలో ఉండగా, మిగిలిన 50 ఎకరాలు ఇంకా వినియోగంలోకి రాలేదని తెలిపారు. సాధారణంగా భూమిని కేటాయించిన సంస్థలు దానిని ఎందుకు వినియోగించలేకపోయాయో వివరణ కోరడం ప్రభుత్వ విధానమని, ఆయా సంస్థల వివరణలు వచ్చిన అనంతరం జిల్లా స్థాయి కమిటీ ఈ అంశంపై చర్చిస్తుందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించిన భూమిని తిరిగి తీసుకునే ఎలాంటి ప్రణాళికలు ప్రభుత్వానికి లేవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఎక్స్ వేదికగా తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ స్పష్టికరణ విడుదల చేసింది. ప్రభుత్వ భూముల వినియోగంపై జరుగుతున్న ఈ వార్షిక ఆడిట్ ఒక సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమేనని ఫ్యాక్ట్ చెక్ ట్వీట్‌లో పేర్కొంది.

Next Story