- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లిళ్లకు స్కూల్ బస్సులు? తెలంగాణ విద్యా కమిషన్ హెచ్చరిక
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల (టీపీఎస్) బస్సులను విద్యా సంబంధిత పనులు మినహా ఇతర ప్రైవేటు కార్యక్రమాలకు వినియోగించడంపై తెలంగాణ విద్యా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల (టీపీఎస్) బస్సులను విద్యా సంబంధిత పనులు మినహా ఇతర ప్రైవేటు కార్యక్రమాలకు వినియోగించడంపై తెలంగాణ విద్యా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కూల్ బస్సులను పెళ్లిళ్లకు, ఇతర కార్యక్రమాలకు వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల బస్సులను విద్యార్థుల రవాణాకు కాకుండా ఇతర అవసరాలకు వాడటం నిబంధనల ఉల్లంఘనే అవుతుందన్నారు. స్కూల్ బస్సులను కేవలం విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడానికి, తిరిగి దింపడానికి, అప్పుడప్పుడు అధికారిక విద్యా విహారయాత్రలకు మాత్రమే ఉపయోగించాలని ఆదేశించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వాహనాలను ప్రైవేటు లేదా వాణిజ్య అవసరాలకు వాడకూడదని, ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నిబంధనలు కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖాధికారులను (డీఈఓ), మంచాల, వంగూరు, పోల్కంపల్లి టీపీఎస్ ల ప్రధానోపాధ్యాయులను ఆయన కోరారు. ప్రజల ఆస్తులైన ఈ వనరులను సద్వినియోగం చేసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పాఠశాలల యాజమాన్యాలకు కమిషన్ సూచించింది.






