వియత్నాం పర్యటనకు తెలంగాణ విద్యా కమిషన్ బృందం

by Malleboina Mahesh |

తెలంగాణ విద్యా విధానంలో సమూల మార్పుల కోసం కృషి చేస్తున్న రాష్ట్ర విద్యా కమిషన్ బృందం, మెరుగైన విద్యా పద్ధతులను అధ్యయనం చేసేందుకు వియత్నాం పర్యటనకు బయలు దేరింది.

వియత్నాం పర్యటనకు తెలంగాణ విద్యా కమిషన్ బృందం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విద్యా విధానంలో సమూల మార్పుల కోసం కృషి చేస్తున్న రాష్ట్ర విద్యా కమిషన్ బృందం, మెరుగైన విద్యా పద్ధతులను అధ్యయనం చేసేందుకు వియత్నాం పర్యటనకు బయలు దేరింది. కమిషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నేతృత్వంలో ఈ బృందం ఐదు రోజుల పాటు స్టడీ టూర్ చేయనుంది. ప్రపంచంలో విద్యారంగంలో వియత్నాం సాధించిన పురోగతిని, ప్రధానంగా ప్రాథమిక, ఉన్నత విద్యలో ఆ దేశం అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను కమిషన్ నిశితంగా పరిశీలించనుంది.

అక్కడి విద్యా సంస్థలు, విధానాలను అధ్యయనం చేసి వాటిలో తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలను గుర్తించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని ఆకునూరి మురళి చెబుతున్నారు. స్టడీ టూర్ ద్వారా సేకరించిన సమాచారం, అనుభవాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి, నూతన విద్యా విధాన రూపకల్పనలో కీలక సిఫార్సులు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం, మౌలిక సదుపాయాలను మెరుగు పర్చడం వంటి లక్ష్యాలతో తెలంగాణ విద్యా కమిషన్ పని చేస్తుంది.

కొత్త విద్యా విధానానికి కమిటీ..

తెలంగాణలో కొత్త విద్యా విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కేశవరావు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సీఎస్ కె.రామకృష్ణారావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాల కిష్టారెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ అక్టోబర్ 30లోగా తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. జాతీయ విద్యా విధానం 2020 ని అధ్యయనం చేసి రాష్ట్రానికి అనుగుణంగా మార్పులు చేయడమే ప్రధానంగా ఈ కమిటీ పని చేయనుంది.

Next Story