ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీమ్‌ భారీ ఆపరేషన్‌.. 50 మంది నైజీరియన్లు అరెస్ట్.. సెక్స్ వర్కర్లు సైతం..

by Ramesh Naini |

తెలంగాణ పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో బిగ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీమ్‌ భారీ ఆపరేషన్‌.. 50 మంది నైజీరియన్లు అరెస్ట్.. సెక్స్ వర్కర్లు సైతం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో బిగ్ ఆపరేషన్ నిర్వహించారు. తెలంగాణ పోలీసుల ఈగల్‌ టీమ్‌, ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ సంయుక్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్స్‌ సరఫరా, హవాలా రాకెట్‌ను ఛేదించారు. నెలల తరబడి సాగిన ఈ ఆపరేషన్‌లో సేకరించిన ఆధారంతో తాజాగా 50మంది నైజీరియన్‌ పౌరులను అరెస్ట్‌ చేశారు. కిలోల కొద్ది అధిక విలువ చేసే మెతాంఫెటమైన్‌, కొకైన్‌ వంటి సింథటిక్‌ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ సమన్వయంతో ఈగల్‌ టీమ్‌ ఢిల్లీలోని 20 కీలక లొకేషన్లపై ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్ కోసం తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ ప్రత్యేకంగా రెండు రైలు బోగీల్లో 100 మందికి పైగా సిబ్బందిని ఢిల్లీకి తరలించినట్లు తెలుస్తోంది. వారంతా వారాల తరబడి ఢిల్లీలోనే మకాం వేసి ఇంటెలిజెన్స్‌ అభివృద్ధి, నిఘా, దాడుల అమలులో కీలక పాత్ర పోషించారు. నోయిడా, విజయవాడ, గ్వాలియర్‌ పోలీసులూ సైతం ఈ ఆపరేషన్‌లో భాగమయ్యారు.

దేశవ్యాప్తంగా విస్తరించిన సిండికేట్‌

డ్రగ్‌ కార్టెల్‌ నెట్వర్క్‌ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, గోవా, కేరళ వరకు విస్తరించి ఉన్నట్లు విచారణలో బయట పడింది. కొరియర్‌ విధానం, ‘డెడ్‌డ్రాప్‌’ పద్ధతుల్లో డ్రగ్స్‌ సరఫరా చేసిన ఈ గ్యాంగ్‌ దాదాపు 2,000 మంది కస్టమర్లను గుర్తించిందని అధికారులు వెల్లడించారు. ఆహార డెలివరీ యాప్‌ల తరహాలో దాచిపెట్టిన కమ్యూనికేషన్‌ విధానాలతో ట్రాన్సాక్షన్లు జరిగేవని అధికారుల సమాచారం. డ్రగ్స్‌ సరఫరా వ్యవస్థను మరింత విస్తరించడానికి సెక్స్‌ వర్కర్లను కూడా ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌తో పాటు పలువురు సేల్స్‌ గర్ల్స్‌, సెక్స్‌ వర్కర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బును స్థానిక హవాలా ఆపరేటర్ల ద్వారా దాచిపెట్టేందుకు ఈ సిండికేట్‌ వినూత్న పద్ధతులు అనుసరించినట్లు పోలీసులు కనుగొన్నారు.

ఇండియన్ కరెన్సీని వస్తువుల రూపంలో, గార్మెంట్స్‌ వంటి రూపాల్లో లాగోస్‌ (నైజీరియా)కు పంపిస్తూ మనీలాండరింగ్‌ నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. సిండికేట్‌ ప్రధాన సూత్రధారి ఒక్కడే సుమారు రూ.15 కోట్లు హవాలా చేసినట్లు సమాచారం. కాగా, ఢిల్లీలో అరెస్ట్ చేసిన 50 మంది నైజీరియన్లను ప్రస్తుతం ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించే ప్రక్రియ జరుగుతోంది. హైదరాబాద్‌కు తీసుకొచ్చిన తర్వాత వారిని న్యాయస్థానం ముందు హాజరు పరిచి, మరింత లోతుగా విచారించేందుకు అవకాశం ఉంది. అలాగే ఢిల్లీలో పట్టుబడిన ఈ ముఠాకు లింకులు ఉన్నట్లు గుర్తించిన మరో ఇద్దరు నైజీరియన్ మహిళలను కూడా ఈగల్ టీమ్ ఏపీలోని విశాఖపట్నంలో అరెస్ట్ చేసినట్లు తెలిసింది.

Next Story