ఢిల్లీలో ‘తెలంగాణ కాంగ్రెస్‌’ సమీక్ష.. రెండేళ్ల పాలన‌పై హైకమాండ్ రివ్యూ

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-19 04:02:01  IST  )

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పనితీరుపై సమీక్షించేందుకు ఏఐసీసీ హైకమాండ్ నేడు ఢిల్లీలో కీలక భేటీ నిర్వహిస్తోంది.

ఢిల్లీలో ‘తెలంగాణ కాంగ్రెస్‌’ సమీక్ష.. రెండేళ్ల పాలన‌పై హైకమాండ్ రివ్యూ
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏఐసీసీ (AICC) ఇవాళ ఢిల్లీలో రాష్ట్రంలో పాలనపై రివ్యూ చేపట్టనుంది. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన మంత్రులు, కీలక నేతలు పాల్గొనబోతున్నారు. 2023లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాల అమలు తీరును హైకమాండ్ విశ్లేషించనుంది. ముఖ్యంగా ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాలు, మిగిలిన మూడేళ్ల కాలానికి దిశానిర్దేశం చేయనున్నారు.

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక

మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో ప్రాథమిక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయతను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. నైనీ బొగ్గు గని టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి హైకమాండ్‌కు వివరణ ఇవ్వనున్నారు. సీనియర్ నాయకులు, మంత్రుల మధ్య తలెత్తిన విభేదాలు, పార్టీ ఫిరాయింపుల విషయంలో పాత, కొత్త నాయకుల మధ్య ఉన్న అసంతృప్తిని పరిష్కరించడంపై ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఓ నివేదికను సమర్పించనున్నారు.

ముఖ్య నేతల భేటీ..

ఏఐసీసీ సమావేశానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వంలోని అంతర్గత విషయాలపై చర్చించనున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రామర్కతో పాటు ఇతర మంత్రులు ఈ సమావేశంలో చేరుతారు. మరోవైపు ఇదే భేటీలో తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.

Next Story