స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య మాటల తూటాలు.. కాంట్రవర్సీకి కారణం ఇదే..

by Bhoopathi Nagaiah |

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య మాటల తూటాలు పేలాయి.

స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య మాటల తూటాలు.. కాంట్రవర్సీకి కారణం ఇదే..
X

దిశ, డైనమిక్ బ్యూరో : 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య మాటల తూటాలు పేలాయి. విజయవాడ, హైదరాబాద్‌లో జెండా పండగ సెలబ్రేషన్స్‌లో భాగంగా గోదావరి, కృష్ణా జలాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు చేసుకున్నారు. గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

ఏ రాష్ట్రానికి నష్టం ఉండదు : ఏపీ సీఎం చంద్రబాబు

తాము నిర్మించ తలపెట్టిన బనకచర్లతో మీకేం ప్రాబ్లం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరోక్షంగా తెలంగాణను ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికీ నష్టం ఉండబోదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాజెక్టు ద్వారా తాము సముద్రంలోని వృథాగా పోయే నీటిని మాత్రమే వినయోగిస్తామని తేల్చి చెప్పారు. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరద నీటితో తాము నష్టాలను భరిస్తున్నామని కామెంట్ చేశారు. అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరమేంటని ఏపీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వరదను భరించాలి కానీ.. ఆ నీటిని వాడుకొవొద్దా అని చంద్రబాబు ప్రశ్నించారు.

గోదావరి, కృష్ణా జలాలపై రాజీలేదు : సీఎం రేవంత్ రెడ్డి

కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి గోల్కొండ కోట వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రెండు రాష్ట్రాల నీటి వాటాలపై వెనకడుగు వేసేది లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుందన్నారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా.. ఆ ఎత్తులను చిత్తు చేస్తాం.. ఎట్టి పరిస్థితుల్లో కుట్రలను ఛేదించి రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు సాధిస్తామన్నారు. తెలంగాణ అవసరాలు అన్నీ తీరాకే.. ఇతర రాష్ట్రాలకు నీరు ఇస్తామని తేల్చి చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను దక్కించుకుని తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Next Story