- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదవిపై మంత్రుల్లో టెన్షన్.. తప్పిస్తారా? కత్తిరిస్తారా?
తెలంగాణ కేబినెట్ రీ-షఫిలింగ్ ఇప్పుడు మంత్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉన్న శాఖలు కత్తిరిస్తారా లేక ఏకంగా తప్పిస్తారా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ, శాఖల మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుండటంతో మెజార్టీ మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. తమ పదవికి ముప్పు ఉంటుందేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. తమ దగ్గర ఉన్న శాఖల్లో కోత పెడుతారేమోనని మరికొందరు మంత్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న శాఖలు తొలగించి, మరింత ప్రయారిటీ ఉన్న శాఖలు తమకు అప్పగిస్తారని ఇంకొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ రీ-షఫిలింగ్ సామాజిక, జిల్లా రాజకీయ సమీకరణల ఆధారంగా.. శాఖల మార్పు పనితీరు ఆధారంగా జరిగే అవకాశం ఉన్నది. దీంతో కొందరు మంత్రులు తమ పదవికి ముప్పు ఏ మేరకు ఉంటుందోనని వారి సన్నిహితుల వద్ద చర్చిస్తున్నారు.
ముగ్గురు అవుట్ ఐదుగురు ఇన్?
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ, విస్తరణలో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో ముగ్గురు మంత్రులను పక్కన పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మూడింటితో పాటుగా ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను సైతం భర్తీ చేయాలని, ఇందుకోసం కేబినెట్‌లోకి కొత్తగా ఐదుగురిని తీసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. మంత్రి పదవులు కోల్పోయే వారిలో అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే ఉండటం ఆశ్చర్యంగా ఉన్నది. వారిని తొలగించడానికి ప్రధాన కారణం ఏంటి? అవినీతి ఆరోపణలా? నిత్యం వివాదాల్లో చిక్కుకోవడమా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనేది ఆసక్తికరంగా మారింది. పదవులు కోల్పోయే వారి జాబితాలో ఓసీ, బీసీ వర్గాలకు చెందిన మంత్రులు ఉన్నట్టు ఏఐసీసీతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఓ నాయకుడు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో విమర్శలు, అసమ్మతికి అవకాశం లేకుండా తొలగించిన మంత్రుల స్థానాలను వారి సామాజిక వర్గాలకు చెందిన వారితోనే (ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలు) భర్తీ చేయాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అలాగే, సామాజిక, జిల్లా సమీకరణాల ఆధారంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయనున్నారు.
లంబాడ, మున్నూరుకాపులకు ప్రయారిటీ
ప్రస్తుత కేబినెట్‌లో లంబాడ, మున్నూరుకాపు సామాజిక వర్గాలకు ప్రయారిటీ లేదు. దీనితో కేబినెట్ విస్తరణలో ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నది. ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ప్రస్తుత మంత్రివర్గంలో ప్రయారిటీ లేదు. దీంతో ఆ రెండు జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటే ఏ సామాజిక వర్గానికి చెందిన మంత్రులను తొలగించాలి? అని విషయంపై అధిష్టానం ఆరా తీస్తున్నది. ఒకవేళ నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇస్తే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చీఫ్ విప్ లేదా డిప్యూటీ స్పీకర్ పోస్టు దక్కే చాన్స్ ఉన్నది. జిల్లాల సమీకరణాల కారణంగా లంబాడ సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదా చీఫ్ విప్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవిలో ఏదో ఒకటి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది.
ఆశావహులు వీరే..
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ, విస్తరణలో మంత్రి పదవి కోసం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి ఉండగా, వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు, మధన్ మోహన్ రావు, మైనంపల్లి రోహిత్ ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, మహేశ్ కుమార్ గౌడ్, విజయశాంతి ఉండగా, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్, రామచంద్రనాయక్ ఉన్నారు.
శాఖల మార్పుపై కసరత్తు
మెజార్టీ మంత్రుల శాఖలను మార్చేందుకు సీఎం రేవంత్ కసరత్తు ప్రారంభించినట్టు టాక్. మంత్రుల పనితీరు, వివాదాలు, అవినీతి ఆరోపణల ఆధారంగా శాఖలను మార్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అందులో భాగంగా కొందరు మంత్రులకు ప్రస్తుతం ఉన్న శాఖను మార్చి, ఆస్థానంలో అంతగా ప్రయారిటీ లేని శాఖ అప్పగిస్తారని తెలుస్తున్నది. ప్రస్తుతం ఒక్కో మంత్రి వద్ద రెండు ప్రధాన శాఖలు ఉన్నాయి. అందులో ఒక శాఖను తొలగించి, కొత్తగా వచ్చిన మంత్రులకు అప్పగించే యోచనలో సీఎం ఉన్నట్టు తెలిసింది. కొందరు మంత్రులు అధిష్టానం వద్ద పైరవీలు చేసి కీలకశాఖలు పొందినా.. ఆ శాఖలో ఆశించిన స్థాయిలో పనితీరు చూపించలేదు. అలాంటి మంత్రుల వద్ద నుంచి సదరు శాఖలను తొలగించి, ఇతరులకు ఇచ్చే చాన్స్ ఉంది. మంత్రి పదవులు కోల్పోయిన వారికి ఏఐసీసీ, సీడబ్ల్యూసీ పదవులు ఇచ్చే అవకాశం ఉన్నది.
హోం మంత్రి ఎవరికి?
ప్రస్తుతం హోం మంత్రి పదవి సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్నది. శాఖల మార్పుల్లో భాగంగా ఆ పదవిని ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు హోంమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు సైతం అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు మహిళలకు ఇస్తారా? లేదంటే పురుషులకు ఇస్తారా? అనే చర్చ జరుగుతున్నది. శాఖల మార్పుల్లో భాగంగా దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రికి ఆ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
కేరళం టూర్ తర్వాత నిర్ణయం
కేరళం ఎన్నికల ప్రచారానికి బయలుదేరిని సీఎం.. రెండు, మూడు రోజుల పాటు అక్కడే ఉండే అవకాశముంది. హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ, విస్తరణ, శాఖల మార్పుకు ముహూర్తం ఫిక్స్ చేస్తారని ప్రచారం జరుగుతున్నది. రాహుల్ గాంధీ కేరళం పర్యటన సమయంలోనే రేవంత్ సైతం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీలైతే అక్కడే రాహుల్‌తో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ, విస్తరణ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. లేదంటే ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లి చర్చలు జరిపే అవకాశముంది.






