నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. అజెండా అంశాలుగా కాళేశ్వరం, ఆర్టీసీ సమ్మె!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-23 04:43:55  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ కానుంది.

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. అజెండా అంశాలుగా కాళేశ్వరం, ఆర్టీసీ సమ్మె!
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన తెలంగాణ సచివాలయం వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ, పరిపాలనా పరమైన అంశాలతో పాటు పలు కీలక సమస్యలపై ఈ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice P.C. Ghosh Commission) నివేదికపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇటీవల ఇచ్చిన తీర్పు కేబినెట్‌లో ప్రధానంగా చర్చకు రానుంది. నిందితులకు నోటీసులు ఇవ్వకుండా నివేదిక ఇవ్వడాన్ని కోర్టు తప్పుపడుతూ, వారిపై ప్రస్తుతానికి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అయితే, ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలా..? లేదా ప్రత్యామ్నాయంగా సీబీఐ విచారణను వేగవంతం చేయాలా? అనే అంశంపై మంత్రివర్గం ఓ నిర్ణయానికి రానుంది.

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఫోకస్..

గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ (RTC) కార్మికుల సమ్మెపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. వేతన సవరణ, ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి 32 డిమాండ్లతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. సామాన్య ప్రజలకు రవాణా ఇబ్బందులు కలగకుండా, కార్మికుల డిమాండ్లపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడం ద్వారా సమ్మెకు ముగింపు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పలు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త నోటిఫికేషన్ల జారీకి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన కంపెనీలకు భూ కేటాయింపులపై కూడా డిస్కస్ చేసి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికపై చర్చ..

సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు ప్రభుత్వం ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికలపై దృష్టి సారించింది. ఎన్నికల షెడ్యూల్ నిర్వహణపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Next Story