TG: సచివాలయంలోనే కేబినెట్ భేటీ

by Naga Rani Yarlagadda |

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సి ఉండగా.. అది వాయిదా పడింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. తొలుత గురువారం మధ్యాహ్నం యాదగిరిగుట్టలో మంత్రిమండలి సమావేశం జరుగుతుందని ప్రభుత్వం జీఓ కూడా విడుదల చేసింది. కానీ.. అదే రోజున సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం అవుతుండటంతో.. మంత్రివర్గ సమావేశాన్ని 23వ తేదీకి వాయిదా వేసింది. 23న యాదగిరిగుట్టలో సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో అక్కడే కేబినెట్ భేటీ నిర్వహిస్తారన్న ప్రచారం జరిగింది. తాజాగా.. మంత్రివర్గ సమావేశంపై ప్రభుత్వ వర్గాలు మరో అప్డేట్ ఇచ్చాయి. ముందుగా చెప్పినట్లు యాదగిరి గుట్టలో కాకుండా హైదరాబాద్ లోని సచివాలయంలోనే మంత్రివర్గ సమావేశం జరుగుతుందని స్పష్టం చేశాయి. ఈ మేరకు మరో జీఓ విడుదల చేశాయి.

జూన్ 2 నుంచి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కానుండటంతో.. పథకానికి అర్హుల ఎంపికపై విధివిధానాలు, మార్పులపై చర్చించనున్నారు. అలాగే హ్యామ్ రోడ్లు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తికావడంతో.. కేబినెట్ భేటీలో పనులపై చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రాష్ట్రంలో పెరగనున్న భూముల ధరలు, సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగులు, పెన్షన్ దారుల హెల్త్ కార్డులు, కొత్త ఉద్యోగ నియామకాలు, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Next Story