మంత్రివర్గంలోకి కొత్తోళ్లు.. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

by Naga Rani Yarlagadda |

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో ఇద్దరిని తప్పించి.. వారిస్థానంలో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలన్న యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్సైనట్లు తెలుస్తోంది.

మంత్రివర్గంలోకి కొత్తోళ్లు.. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కేబినెట్‌లోకి కొత్త వారు రాబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రుల్లో ఒకరిద్దరిని తప్పించాలని ఇప్పటికే డిసైడ్ అయినట్టు సమాచారం. వారికి పార్టీ పదవులు కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు టాక్. వారి సీనియారిటీ మేరకు సీడబ్ల్యూసీ, ఏఐసీసీ పదవులు ఇస్తామని సదరు నేతలకు ఇప్పటికే సంకేతాలను పంపినట్టు తెలిసింది. అందుకు ఆ లీడర్లు సైతం సానుకూలంగా స్పందించినట్టు పార్టీవర్గాల్లో చర్చ నడుస్తున్నది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఒకరిద్దరు మంత్రులను తప్పించి.. వాటితో పాటు ఖాళీగా ఉన్న మరోరెండు మంత్రి పదవులను భర్తీచేసేందుకు ముహూర్తం ఖరారు కానున్నట్టు తెలిసింది.

అదే సామాజిక వర్గానికి ఛాన్స్

జిల్లాలు, సామాజిక సమీకరణల నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది. విమర్శలు రాకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నది. తప్పించిన మంత్రుల స్థానాలను అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతోనే భర్తీచేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

హుందాగా తప్పించాలని!

మంత్రి పదవుల నుంచి తప్పించిన వారు అవమానంగా ఫీల్ కాకుండా ఉండేందుకు వారికి ప్రమోషన్లు కల్పించాలని అధిష్టానం భావిస్తున్నట్టు చర్చ నడుస్తున్నది. వారికి పార్టీలో కీలకమైన, గౌరవప్రదమైన సీడబ్ల్యూసీ, ఏఐసీసీ పదవులు కట్టబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

విస్తరణలో ఎవరెవరికి ఛాన్స్

కేబినెట్ విస్తరణలో బీసీ, ఎస్టీ వర్గాలకు ప్రయారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగా బీసీ కులాల్లో ఎక్కువ సంఖ్యాబలం ఉన్న మున్నూరు కాపు వర్గానికి, అలాగే ఎస్టీ సామాజికవర్గంలో ఎక్కువ జనాభా ఉన్న లంబాడీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్నది. ఈ సారి కౌన్సిల్ నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన ఓ లీడర్ కు సైతం మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్టు తెలిసింది. సదరు లీడర్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే సమయంలోనే మంత్రి పదవి సైతం ఇస్తామని స్వయంగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్టు టాక్.

మంత్రి పదవి దక్కని వారికి చీఫ్ విప్!

కేబినెట్‌లో మార్పులు, చేర్పుల సమయంలోనే చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులను భర్తీచేయాలని అధిష్టానం భావిస్తున్నది. అందుకే ఈ మధ్య అసెంబ్లీ, మండలి విప్‌ల నియామకం చేపట్టినా.. చీఫ్ విప్ నియామకాలను పెండింగ్ పెట్టారనే చర్చ నడుస్తున్నది. మంత్రి పదవి దక్కని సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే‌కు కేబినెట్ హోదా ఉండే చిఫ్ విప్ పదవి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్. గతేడాది జూన్‌లో డిప్యూటీ స్పీకర్ పదవిని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కు ఇస్తున్నట్టు ప్రకటించారు. కానీ తనకు ఆ పదవి ఇష్టం లేదని, మంత్రి పదవి కావాలని ఆయన ప్రభుత్వ పెద్దలకు చెప్పడంతో ఇంతవరకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగలేదు. ప్రస్తుత సమావేశాల్లో సైతం జరుగుతుందో లేదోననే అనుమానాలు ఉన్నాయి. చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులు కేబినెట్ హోదాతో కూడినవి కావడంతో మంత్రివర్గంలో మార్పులు చేర్పుల సమయంలోనే భర్తీచేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో నడుస్తున్నది.

Next Story