BIG News : రేపు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ

by Bhanu |

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది.

BIG News : రేపు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు, రేపు (జూన్ 8) మధ్యాహ్నం కేబినెట్‌ విస్తరణ జరగనుంది. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు రాత్రి హైదరాబాద్‌కి రానున్నట్టు సమాచారం.

కేబినెట్‌లో కొత్త ముఖాలకు అవకాశం కల్పించేందుకు, కొందరిని తప్పించేందుకు కూడా అధిష్టానం కసరత్తు చేస్తోందని సమాచారం. ఇందుకు సంబంధించిన తుది నిర్ణయాలు ఇప్పటికే అధిష్టానానికి చేరుకున్నాయి. ప్రస్తుత మంత్రుల్లో ఇద్దరిని తొలగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వారెవరనే విషయంపై అధికార వర్గాలు ఇంకా స్పష్టత ఇవ్వనప్పటికీ, పార్టీలోని అసంతృప్త వర్గాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.

ఇక కొత్తగా కేబినెట్‌లోకి రానున్న నేతల ఎంపికలో సామాజిక న్యాయం ముఖ్య ప్రమాణంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా మాదిగ, లంబాడీ వంటి వెనుకబడిన వర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకమాండ్‌ను అభ్యర్థించినట్టు సమాచారం. ఇప్పటికే ఆయన ఢిల్లీ పర్యటనలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతలతో సంప్రదింపులు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా కొత్త నియామకం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ పదవికి కూడా సామాజిక సమానత్వాన్ని ప్రతిబింబించేలా ఒక వెనుకబడిన వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం కల్పించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, కేబినెట్ విస్తరణ పైన కాంగ్రెస్ శ్రేణులలో ఆసక్తికరత పెరిగింది. మంత్రివర్గంలో స్థానం దక్కించుకోవాలన్న ఆశలు పలువురు ఎమ్మెల్యేలలో కనిపిస్తున్నాయి. ఈ మార్పులు, నియామకాలు ప్రభుత్వ పరిపాలనలో కొత్త ఊపుని తీసుకొస్తాయా..? లేక అసంతృప్తి పెంచుతాయా..? అనే ప్రశ్నలకు రేపటి కేబినెట్ విస్తరణ స్పష్టత ఇస్తుందనడం అతిశయోక్తి కాదు.

Next Story