- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇప్పసారాతో తెలంగాణ బ్రాండ్ క్రియేట్ చేయాలి : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
ఇప్పపూల సారాతో తెలంగాణ బ్రాండ్ ను క్రియేట్ చేయాలని, తద్వారా ప్రభుత్వానికి, ఆదివాసీలకు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు.

దిశ, జడ్చర్ల : రసాయనాలు ఉపయోగించి తయారు చేసే కల్తీ సారా గురించి తాను మాట్లాడటం లేదని, అడవుల్లో సహజంగా దొరికే ఇప్పపూలతో తయారు చేసే సారాను ప్రమోట్ చేయాలని మాత్రమే కోరుతున్నానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పపూలతో తయారు చేసే సారాతో తెలంగాణ బ్రాండ్ ను క్రియేట్ చేయాలని, తద్వారా అటు ప్రభుత్వానికీ ఇటు ఆదివాసీ, గిరిజనులకు కూడా భారీ ఎత్తున ఆదాయం వచ్చేలా చూడాలని తాను ప్రభుత్వాన్ని కోరనున్నామని తెలిపారు. ఇప్పపూల సారా అనేది తన వ్యక్తిగత ఆలోచన అని, కేవలం తాను గిరిజనుల కోసమే దీని గురించి అసెంబ్లీలో మాట్లాడాలని నిర్ణయించుకున్నానని వివరించారు.
115 ఏళ్ల నుంచి సారా తయారీ ఉంది
జడ్చర్ల క్యాంపు కార్యాలయంలో మంగళవారం అనిరుధ్ రెడ్డి విలేఖరులతో మాట్లాడారు. తాను సారాపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ఇప్పపూలతో సారా తయారు చేయడం అనేది 5వేల ఏళ్ల క్రితం నుంచే మన దేశంలో ఉందని, అయితే బ్రిటీష్ వాళ్లు మన దేశానికి వచ్చిన తర్వాత వారు తయారు చేసే మద్యాన్ని అమ్ముకోవడానికి ఇప్పసారా తయారీని బంద్ చేయించారని చెప్పారు. గతంలో ఇప్పసారా తాగిన వాళ్లు 115 ఏళ్ల వరకూ బతికే వారని, అయితే ఇప్పుడు తాగుతున్న మద్యం కారణంగా 60 ఏళ్లకే మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయం గురించి తాను ఎంతో పరిశోధన చేసిన తర్వాతనే ఈ విషయాలపై మాట్లాడుతున్నానని తెలిపారు. విదేశాల్లో మన ఇప్పపూల తరహాలోనే తయారు చేసి టకీలా అనే సారా తయారు చేసే దేశం లక్ష కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తోందని, అలాగే చైనా, జపాన్ లు కూడా తమ సాంప్రదాయపు మద్యాన్ని తయారు చేసి ప్రప్రంచ వ్యాప్తంగా అమ్ముతున్నాయని అన్నారు. అదే విధంగా సాంప్రదాయకమైన ఇప్పసారాను కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రమోట్ చేయడం ద్వారా మన రాష్ట్రానికి కూడా లక్ష కోట్ల ఆదాయాన్ని సంపాదించి పెట్టాలని, దాని ద్వారా ఆదివాసీ, గిరిజనులు కూడా ప్రతి యేటా లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించుకోవాలన్నదే తన లక్ష్యమని వివరించారు.
ఇప్పసారాకు ప్రపంచ వ్యాప్తంగా ఒక గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్
ఇప్పసారాకు ప్రపంచ వ్యాప్తంగా ఒక గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్‌ను తీసుకురావాలన్నదే తన ఆలోచన అని అనిరుధ్ రెడ్డి చెప్పారు. బెల్టుషాపులను అరికట్టడంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు. తాను ఇప్పసారా గురించి మాత్రమే మాట్లాడితే కొన్ని మీడియా సంస్థలు వాటికి మసాలాలు జోడించి తాను సారా ప్రభుత్వమే అమ్మాలని, సారా దుకాణాలు మళ్లీ తెరవాలని చెప్పినట్లుగా ప్రచారం చేశాయని వాటిలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆయన వెంట జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత, మాజీ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బద్మి శివకుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ యాదవ్, మినాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల ప్రభుత్వాస్పత్రి స్థాయి వంద పడకలకు పెంపు
జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో పడకల సంఖ్యను 50 నుంచి 100 కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. గతంలో జడ్చర్ల ఆస్పత్రిలోని పడకల సంఖ్యను 50 కు తగ్గిస్తూ గత ఏడాదిలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. అయితే పడకల సంఖ్యను తగ్గించిన కారణంగా ఆమేరకు ఆస్పత్రికి కేటాయించే సిబ్బంది, సౌకర్యాలు కూడా తగ్గిపోతాయని ప్రజల్లో ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో ఈ విషయాన్ని తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. దీంతో ప్రభుత్వం జడ్చర్ల (బాదేపల్లి) ఆస్పత్రిలో పడకల సంఖ్యను 50 నుంచి 100 కు పెంచుతూ వైద్యవిధాన పరిషత్ ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. బాలానగర్ సీహెచ్ సీ లో పడకల సంఖ్యను గతంలో 30 నుంచి 23 కు తగ్గించగా దీన్ని కూడా మళ్లీ 30 పడకలకు పెంచుతూ ప్రభుత్వం వైద్యవిధాన పరిషత్ ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.
ఉదండాపూర్ నిర్వాసితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..!
తాను హామీ ఇచ్చిన విధంగానే ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్ ఆర్ ప్యాకేజ్ కింద ఇచ్చే పరిహారాన్ని పెంచామని ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనులను ఎవరైనా అడ్డుకుంటే తాను ఊరుకోనని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. అవార్డు పాసైన తర్వాత పరిహారాన్ని పెంచిన దాఖలాలు ఎక్కడా లేవని కానీ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ప్రత్యేకంగా ఉదండాపూర్ నిర్వాసితులకే పరిహారాన్ని పెంచారని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగిల్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అనే తేడాను చూపించి, సింగిల్ ఫ్యామిలీకి రూ.6.5 లక్షలు, జాయింట్ ఫ్యామిలీకి రూ.16 లక్షలు పరిహారంగా నిర్ణయించారని చెప్పారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల విషయంలో ఇలాంటి తేడాలుచూపించలేదన్నారు.
ప్రస్తుతం తమ ప్రభుత్వం సింగిల్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అనే తేడా లేకుండా అందరికీ ఒకే పరిహారంగా రూ.18 లక్షలు ప్రకటించిందని తెలిపారు. దీంతో నిర్వాసితులకు రూ. 2 నుంచి రూ.12 లక్షల దాకా అదనపు పరిహారం లభిస్తుందన్నారు. ఇదివరకే పరిహారం మొత్తాలను అందుకున్న వల్లూరు, వల్లూరు తాండాలకు కూడా పెంచిన అదనపు పరిహారాన్ని ప్రభుత్వం అందించనుందని చెప్పారు. పెంచిన పరిహారం కోసం అదనంగా రూ.146 కోట్లతో కలిపి మొత్తం రూ.374 కోట్ల మొత్తాన్ని రెండు నెలల్లోపుగా నిర్వాసితులకు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అదనపు పరిహారం కోసం విడుదల చేసిన జీవో నెంబర్.1 కేవలం ఉదండాపూర్ నిర్వాసితులకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసిందని వెల్లడించారు. ఉదండాపూర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెంపు సమస్య పరిష్కారమైన నేపథ్యంలో పనులు సాఫీగా కొనసాగించడానికి అందరూ సహకరించాలని కోరారు.






