కేంద్ర ఓబీసీ జాబితాలో 40 కులాలను చేర్చాలి : తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్​

by Ajay Maddhiboyina |

కేంద్ర ఓబీసీ జాబితాలో 40 కులాలను వెంటనే చేర్చాలని మోడీ ప్రభుత్వాన్ని తెలంగాణ వెనకబడిన తరగతుల కమిషన్​ కోరింది. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ దీంతో ఆ కులాల వారు

కేంద్ర ఓబీసీ జాబితాలో 40 కులాలను చేర్చాలి : తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ఓబీసీ జాబితాలో 40 కులాలను వెంటనే చేర్చాలని మోడీ ప్రభుత్వాన్ని తెలంగాణ వెనకబడిన తరగతుల కమిషన్​ కోరింది. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ దీంతో ఆ కులాల వారు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో, ఉద్యోగరంగంలో తమ అవకాశాలను కోల్పోతున్నారని పేర్కొంది. ఆయా కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఛైర్మన్‌ జి.నిరంజన్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతేగాకుండా కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ కు లేఖ రాసినట్లు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణకు సంబంధించిన కేంద్ర ఓబీసీ జాబితాను 2016 సంవత్సరంలో ప్రకటించడం జరిగిందని, అప్పటికే బీసీ జాబితాలో 112 కులాలుండగా, కేంద్రం 90 కులాలతో మాత్రమే జాబితా ప్రకటించిందన్నారు.

తరువాత రాష్ట్ర జాబితాలో అనాధలను, మరో 17 కులాలను రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. దీంతో రాష్ట్రంలోని బీసీ జాబితాలో మొత్తం కులాల సంఖ్య 130 చేరగా, కేంద్ర జాబితాలో చేర్చవలసిన కులాల సంఖ్య 40కి చేరింది. కేంద్ర జాబితాలో లేనటువంటి కులాలను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం 2016 నుండి వివిధ దఫాలుగా కేంద్రాన్ని కోరడంతో పాటు బీసీ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ లేఖలు రాయటం జరిగిందన్నారు. 2021 డిసెంబర్‌ నెలలో 40 కులాలను కేంద్ర జాబితాలో చేర్చే విషయంలో జాతీయ బీసీ కమిషన్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలో విచారణ కూడా జరిగిందని గుర్తు చేశారు. 2023 సెప్టెంబర్‌ 5న జాతీయ బీసీ కమిషన్‌ అధ్యక్షుడు హంసరాజ్‌ గంగారామ్‌ ఆహీర్‌ ఆధ్వర్యంలో మరో మారు న్యూఢిల్లీలో విచారణ చేపట్టారని పేర్కొన్నారు. అయిన ఈ 40 కులాలను కేంద్ర జాబితాలో చేర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడం బాధకరమన్నారు.

Next Story