తెలంగాణ అసెంబ్లీ సరికొత్త రికార్డు.. ఏకంగా 8 గంటల పాటు ‘జీరో అవర్’

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-06 01:23:17  IST  )

తెలంగాణ శాసనసభ అరుదైన రికార్డును నెలకొల్పింది. అసెంబ్లీ సమావేశాల చరిత్రలోనే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపుగా 8 గంటల పాటు క్వశ్చన్, జీరో అవర్‌కు స్పీకర్ సమయం కేటాయించారు.

తెలంగాణ అసెంబ్లీ సరికొత్త రికార్డు.. ఏకంగా 8 గంటల పాటు ‘జీరో అవర్’
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ శాసనసభ అరుదైన రికార్డును నెలకొల్పింది. అసెంబ్లీ సమావేశాల చరిత్రలోనే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపుగా 8 గంటల పాటు క్వశ్చన్, జీరో అవర్‌కు స్పీకర్ సమయం కేటాయించారు. గతంలో ఎన్నడూ ఇంత సమయం కేటాయించలేదని, తమ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించడానికి అవకాశం దొరికిందని సభ్యులు సంతోషం వ్యక్తంచేశారు. సాధారణంగా జీరో అవర్‌లో పార్టీకి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, అందులో కేవలం రెండు నుంచి మూడు నిమిషాల పాటు మాత్రమే మాట్లాడే అవకాశం దొరుకుతుంది. కానీ సోమవారం జరిగిన జీరో అవర్ ఏకంగా రెండున్నర గంటల పాటు సాగింది. ఆ సమయంలో టైం లిమిట్ పెట్టకుండా మాట్లాడే అవకాశం దక్కడంతో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని సమస్యలను సభలో ప్రస్తావించారు. ఒక ఎమ్మెల్యే ఒక సమస్యను మాత్రమే ప్రస్తావించాల్సి ఉంటుంది. కానీ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చేందుకు ఎన్నికైన సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకరావడానికి సరైన వేదిక అసెంబ్లీ అని గుర్తించిన స్పీకర్​ శాసనసభ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయించారు.

అందరికీ దక్కిన అవకాశం..

స్పీకర్ చొరవతో సభలోని సభ్యులందరూ తమ నియోజకవర్గంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకవచ్చారు. ప్రధానంగా సీసీ రోడ్లు నిర్మాణాలు, చెక్ డ్యామ్, చెరువుల అభివృద్ధి, స్కూళ్లు, కాలేజీలు, వైద్య సదుపాయాలు, కోతులు, వ్యవసాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే, బీఆర్ఎస్ సర్కారు హయాంలో సగం చేసి వదిలేసిన పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకవచ్చారు. నియోజకవర్గంలో పలు బీసీ కులాలకు ఆత్మ గౌరవ భవనాలు నిర్మించాలని అప్పీలు చేశారు. విద్యుత్ సబ్​ స్టేషన్‌ల ఏర్పాటు, విద్యుత్​సమస్యలను ప్రస్తావించారు.కాగా, సోమవారం హిల్ట్ పాలసీపై స్వల్పకాలిక చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇండస్ట్రీ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ప్రిపేరయ్యారు. కాని ‘పూలే’ సినిమాను వీక్షించేందుకు కేబినెట్, ఎమ్మెల్యేలు అందరూ వెళ్లాలని నిర్ణయం తీసుకోవడంతో హిల్ట్ పాలసీపై చర్చను మంగళవారానికి వాయిదా వేశారు. సభను బీఆర్ఎస్ బాయ్‌కాట్ చేయడంతో సభా కార్యక్రమాలు సాఫీగా సాగుతున్నాయని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. కానీ విపక్షం లేకపోవడంతో అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా లేవని వ్యాఖ్యానించారు.

Next Story