అంతర్జాతీయ విద్యా హబ్‌గా తెలంగాణ

by Muthe.Rajitha |

రాష్ట్రం అనుసరిస్తున్న ఉన్నత విద్యా నమూనా దక్షిణాది రాష్ట్రాలకు ఒక మార్గదర్శకంగా నిలుస్తోందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్ట రెడ్డి పేర్కొన్నారు.

అంతర్జాతీయ విద్యా హబ్‌గా తెలంగాణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం అనుసరిస్తున్న ఉన్నత విద్యా నమూనా దక్షిణాది రాష్ట్రాలకు ఒక మార్గదర్శకంగా నిలుస్తోందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్ట రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం శామీర్‌పేటలోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో శాస్త్రి ఇండో-కెనడియన్ ఇన్‌స్టిట్యూట్ (సిసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణ ప్రాంత రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విధాన ఆధారిత సంస్కరణలు, పరిశ్రమల అనుసంధానం, విద్యా సంస్థల మధ్య సమన్వయం ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేశాయని ప్రొఫెసర్ రెడ్డి వివరించారు.

జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ2020)కు అనుగుణంగా రూపొందించిన 'తెలంగాణ విద్యా విధానం' (టీఈపీ),రైజింగ్ తెలంగాణ 2047 రోడ్‌మ్యాప్ ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. దక్షిణ భారత విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ ఆయన పలు కీలక సూచనలు చేశారు. ఉన్నత విద్యలో సరికొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అకడమిక్ పరిపాలనను పునర్నిర్మించాలని సూచించారు. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, విశ్వవిద్యాలయాలు-పరిశ్రమ-ప్రభుత్వం కలిసి పనిచేసే కన్సార్టియం విధానంలో ఫలితాలను సాధించాలన్నారు.

ఇండో-కెనడియన్ భాగస్వామ్యం:

కెనడా విద్యా సంస్థలతో చురుకుగా భాగస్వామ్యం కావాలని తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఆయన పిలుపునిచ్చారు. ఇందుకు అవసరమైన పూర్తి మద్దతును ఉన్నత విద్యా మండలి అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో నల్సార్ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ కృష్ణ దేవరావు మాట్లాడుతూ అంతర్జాతీయ సహకారం, పరిశోధనలకు తమ విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందని తెలిపారు. సీసీ డైరెక్టర్ డాక్టర్ ప్రచి కౌల్ సంస్థ యొక్క నూతన వ్యూహాలను వివరించారు. ఈ కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణకు చెందిన సుమారు 25 మంది వైస్‌చాన్స్‌లర్లు, డైరెక్టర్లు ప్రత్యక్షంగా, ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు.

Next Story