- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ అమరనాథ్ యాత్ర.. సలేశ్వరం జాతర
రాష్ట్రంలో అతిపెద్ద ఆదివాసీల జాతర సమ్మక్క సారక్క. సలేశ్వరం జాతర రెండోది అని చెప్పవచ్చు.

దిశ, అచ్చంపేట : నల్లమల్ల అటవీ ప్రాంతం అనేక శివాలయ క్షేత్రాలకు పుట్టినిల్లు. కొండల గుట్టల మధ్యన శివ క్షేత్రాలకు నిలయమై భక్తుల చేత ఆయా సందర్భాలలో పూజలు అందుకుంటున్న శైవ క్షేత్రాలు అనేకం. రాష్ట్రంలో అతిపెద్ద ఆదివాసీల జాతర సమ్మక్క సారక్క. సలేశ్వరం జాతర రెండోది అని చెప్పవచ్చు. సమ్మక్క సారలమ్మ జాతర రెండేళ్లకొకసారి జరిగితే.. సలేశ్వరం జాతర ప్రతి ఏడాది జరగడం విశేషం. రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం పరిధిలోని నల్లమల్ల లోతట్టు అటవీ ప్రాంతం లో కొండలు, కోనలు, రెండో ఎత్తయిన గుట్టల సరికల మధ్యన వెలిసిన సలేశ్వరం శివలింగయ్యను దర్శించుకోవాలంటే సాహసోపేతమైన యాత్ర చేయాల్సి ఉంటుంది.
లింగమయ్య దిగువన దాదాపు వెయ్యి అడుగుల ఎత్తు నుంచి జలపాతాన్ని తాకిన భక్తులు మైమరిసిపోతూ గుండంలో పుణ్య స్థానాలు చేస్తారు. ఈ యాత్రను దక్షిణ భారత దేశంలో తెలంగాణ అమరనాథ్ యాత్ర గా పిలువబడుతున్న ఈ సాహస యాత్రకు రాష్ట్ర నలుమూలల నుండి కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు, ప్రకృతి ప్రేమికులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా దర్శించుకుంటారు. యాత్ర ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి ఒక్క రోజే దాదాపు లక్ష మంది కి పైగా భక్తులు శివనామ స్వరంతో దర్శించుకుంటారు. ఏప్రిల్ 1 నుండి 3 వరకు సలేశ్వరం జాతర ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది సలేశ్వరం జాతర వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. వన్యప్రాణులకు ముప్పు వాటిల్లకుండా ప్లాస్టిక్ నియంత్రణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చొరువ చూపుతున్నారు.
ఆలయ చరిత్ర..
నాగార్జున కొండలో బయటపడిన ఆధారాలను బట్టి ఇక్ష్వాకుల కాలం క్రీస్తు శకం 360 కాలపు నిర్మాణాలు లింగమయ్య గుడికి ఏర్పాటుచేసిన ఇటుకలను బట్టి అర్థమవుతుంది. అలాగే గర్భగుడి ముఖద్వారం నాటి విష్ణు కుండీల శిలాఫలకం ఉన్నది. ఆలయాన్ని ద్వారానికి కుడివైపున వీరభద్రుడు దక్షకుడి విగ్రహాలు, ఎడమవైపున రెండు సిద్ధ విగ్రహాలు ఉన్నాయి. ఆలయానికి ముందు భాగంలో 10 అడుగుల క్రింద సలేశ్వరం గుండం ఉన్నది.
వస్తున్నాం లింగమయ్య..
నల్లమల్ల కొండల్లో కోనల్ల మధ్యన వెలిసిన లింగమయ్య స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన సుమారు 4 కి.మీ కొండలు గుట్టలను ఎక్కుతూ, దిగుతూ లోయల సరికలకుండా భక్తులు వస్తున్నాం.. వస్తున్నాం.. లింగమయ్య, హర హర శంభో శంకర అంటూ భక్తులు గొంతు ఎత్తుతూ కొండల మధ్యన శివనామ స్వరంతో దరులు దద్దరిల్లేలా యాత్రను కొనసాగిస్తారు.
సాహసోపేతమైన యాత్ర..
చైత్ర మాసం పౌర్ణమి సందర్భంగా నల్లమల్ల అడవుల్లో కొలువుదీరిన శివలింగయ్యను దర్శించుకునే యాత్ర అమరనాథ్ ను తలపించేలా ఈ యాత్ర ఉంటుంది. అమరనాథ్ యాత్ర మంచు కొండలలో కొనసాగితే ఈ యాత్ర మాత్రం అడవులు, కొండలు, గుట్టలు, లోయలు మార్గంలో కొనసాగుతది. స్వామిని దర్శించుకునే సమీప ప్రదేశంలో రెండు గుట్టల మధ్యన ఇరుకైన బాటలో భక్తులు సాహసోపేతంగా నడుస్తూ అలసిపోయిన భక్తులకు గుండం వద్దకు చేరుకోగానే సుమారు వెయ్యి అడుగుల ఎత్తు నుండి దూకే జలపాతాన్ని తాకగానే కాలినడకన వచ్చిన బాధను మరిచిపోయి మైమరసిపోతూ లింగమయ్య దర్శించుకుంటారు.
ఆది నుంచి ఆదివాసులే పూజారులు..
సమ్మక్క సారలమ్మ జాతర లో ఆదివాసులే పూజారులు ఎలా ఉత్సవాలను కొనసాగిస్తారో.. నల్లమల్ల అడవి ప్రాంతంలో కొండల మధ్యన వెలిసిన సలేశ్వరం లింగమయ్య జాతర వద్ద ఆదివాసి చెంచులే పూజారూలుగా కొనసాగుతున్న ఆనవాయితీ.
ఎలా వెళ్లాలంటే..?
సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవాలంటే నాగర్ కర్నూల్ జిల్లా లో ఒక మార్గం లింగాల మండలం అప్పాయి పల్లి గ్రామం మీదుగా 30 కిలోమీటర్ల కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. మరో మార్గం శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారి వెంట అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామానికి చేరుకోవాలి. అక్కడ నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరహాబాద్ చౌరస్తా నుంచి అడవి మార్గంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్ పెంట వద్దకు వాహనాలు ద్వారా చేరుకోవచ్చు. అక్కడనుండి నాలుగు కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు లోయలు దాటుకుంటూ సాహసోపేతమైన యాత్ర కాలినడకన లింగమయ్యను దర్శించుకోవాల్సి ఉంటుంది.
ప్రత్యేక బస్సులు..
సలేశ్వరం జాతర వేడుకలకు భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి కాకుండా నల్గొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. ఈ బస్సులు రాంపూర్ పేట వద్దకు మాత్రమే చేరుకుంటాయి. అక్కడ నుండి భక్తులు కాలినడకతో 4 కి.మీ పాదయాత్ర చేసి.. అక్కడ అన్నదానంలో పాల్గొని గుట్టల్లో మరో నాలుగు కి.మీ వరకు వెళ్లి సలేశ్వరం లింగమయ్యను దర్శించుకుంటారు.
భారీ బందోబస్తు..
సలేశ్వరం జాతర వేడుకలకు లక్షలాది భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్, అడవి శాఖ సమన్వయంతో పెద్ద మొత్తంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ శాఖ డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇటీవల నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ ఏర్పాట్లు చేయాలని.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీరు, వైద్యం, శానిటేషన్ తదితర సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ జాతర ఏర్పాట్లకు రెవెన్యూ, అటవీశాఖ, పోలీస్, ఆర్ డబ్ల్యూఎస్ అధికారుల సమన్వయంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.






