"ఐబొమ్మ రవి దమ్మున్నోడు.. మీకు దమ్ముంటే సైబర్ నేరాలు ఆపండి": సజ్జనార్‌కు తీన్మార్ మల్లన్న సవాల్

by Naga Rani Yarlagadda |

ఐ బొమ్మ, బప్పం టీవీల నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది.

ఐబొమ్మ రవి దమ్మున్నోడు.. మీకు దమ్ముంటే సైబర్ నేరాలు ఆపండి: సజ్జనార్‌కు తీన్మార్ మల్లన్న సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐ బొమ్మ, బప్పం టీవీల నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. తాజాగా దీనిపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పై ఆయన చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐబొమ్మ రవి దమ్మున్న వాడని, అందుకు ప్రజలంతా అతనికి మద్దతిస్తున్నారన్నారని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. రవి భార్య పోలీసులకు సమాచారం ఇవ్వకపోయి ఉంటే పోలీసులు అతడిని పట్టుకునేవారే కాదన్నారు. ఇకనైనా పోలీసులు సినిమా డైలాగులు చెప్పడం మానుకోవాలని సూచించారు.

వంద రూపాయల టికెట్ ను వేలల్లో అమ్ముకునే సినిమావాళ్లేమైనా సంసారులా? అని ప్రశ్నించారు. సీపీ సజ్జనార్ సినిమా వాళ్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడంపై కూడా మండిపడ్డారు. సజ్జనార్ చేసేవన్నీ ఫేక్ ఎన్కౌంటర్లని, వరంగల్ లో కూడా అదే చేశారని ఆరోపించారు. దమ్ముంటే దేశంతో జరుగుతున్న సైబర్ క్రైమ్స్, కిడ్నాప్ లు, ఆర్థిక నేరాలను ఆపి చూపించాలని సవాల్ చేశారు. ఇలాంటి సైబర్ మోసాలు ఎప్పటికీ ఆగవని సీవీ ఆనంద్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కొందరు మల్లన్న చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం రాష్ట్ర పోలీస్ శాఖను అగౌరవ పరిచారని మండిపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story