బీసీ స్టడీ సర్కిళ్లకు నవశకం.. యూట్యూబ్ వేదికగా టెక్ పాఠాలు

by Malleboina Mahesh |

బీసీ స్టడీసర్కిళ్ల డిజిటల్ విప్లవం.. 12 జిల్లాల పరిధిలో యూట్యూబ్ చానెల్స్ ప్రారంభం.. అన్ని పోటీ పరీక్షలకూ ఉచితంగా నిపుణుల క్లాసులు!

బీసీ స్టడీ సర్కిళ్లకు నవశకం.. యూట్యూబ్ వేదికగా టెక్ పాఠాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని నిరుపేద యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు బీసీ స్టడీసర్కిళ్లు ఎంతో దోహదపడుతున్నాయి. గతంలో కేవలం నిపుణులైన గెస్ట్‌లను పిలిపించి ఉద్యోగార్థులకు క్లాసులు చెప్పించేవారు. వాటిని నోట్ చేసుకుని ప్రిపేరయ్యే వారు. రాష్ట్రంలోని 12 బీసీ స్టర్కిళ్లలో కేవలం 2500 మందికి మాత్రమే తరగతులు వినే అవకాశం ఉండేది. మిగతావారు ప్రైవేట్ అకాడమీలను ఆశ్రయించి డబ్బులు చెల్లిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలని బీసీ స్టడీసర్కిళ్ల స్టేట్ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ సంకల్పించారు. తన ఆలోచనను మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వివరించగా ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ఒకేసారి 12 యూట్యూబ్ చానెల్స్‌ ప్రారంభించారు.

అందుబాటులో అన్ని సబ్జెక్టులు

ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో స్టడీ సర్కిళ్లలో నిపుణులు క్లాసులు చెబుతుంటే వాటిని రికార్డ్ చేసి మొబైల్ ద్వారానే ఎడిట్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో అదనంగా ఎలాంటి ఖర్చు లేకుండా ఉద్యోగార్థులకు సబ్జెక్ట్ వీడియోలు అందుబాటులోకి వస్తున్నాయి. టీజీబీసీ స్టడీ సర్కిల్ పేరుతో ఈ యూట్యూబ్ చానెల్స్‌ ప్రారంభించారు. వీటిల్లో నిపుణులతో చెప్పించిన క్లాసుల వీడియోలే కాకుండా జాబ్ నోటిఫికేషన్ల అధికారిక సమాచారం, కరెంట్ అఫైర్స్, సబ్జెక్టు వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రత్యేకించి కీలక అంశాలను షార్ట్స్‌ మాదిరిగా ఎడిట్ చేసి యూట్యూబ్, ఇన్‌స్టా, టెలిగ్రామ్ లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఉద్యోగార్థుల్లో స్పూర్తిని నింపడానికి థీమ్ సాంగ్ ను సైతం రూపొందించారు.

పోటీ పరీక్షలకు ప్రత్యేకం

రాష్ట్రంలో హైదరాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి, సిద్ధిపేట, నిజామాబాద్, జోగులాంబ గద్వాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. ఈ సెంటర్లలో యూట్యూబ్ చానెళ్ల బాధ్యతలను ఆయా కేంద్రాల డైరెక్టర్లు చూసుకుంటున్నారు. వీరితో స్టేట్ డైరెక్టర్ కోఆర్డినేట్ చేస్తూ వీడియోలు అప్‌లోడ్ చేయిస్తున్నారు. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రోగ్రాం, గ్రూప్-1,2,3,4, ఫౌండేషన్ కోర్సులు, సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పోలీస్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్, జిల్లా సెలక్షన్ కమిటీ, జూనియర్ లెక్చర్స్, బ్యాంక్ పీవో, బ్యాంక్ క్లర్క్, ఆర్ఆర్‌బీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్ట్ వీడియోలను ఉద్యోగార్థులకు అందుబాటులోకి తెచ్చారు.

సమయం, డబ్బు ఆదా..

ఈ చానెల్స్ ద్వారా ఎక్కడైనా సబ్జెక్టు క్లాసులు వినే అవకాశం ఉంటుంది. ఉద్యోగార్థులకు సమయం, డబ్బు ఆదా అవుతుంది. స్టడీ సర్కిళ్లలో క్లాసులు వినలేని వారికి ఈ వీడియోలు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రైవేట్ అకాడమీలతో పోలిస్తే.. నిపుణులైన అధ్యాపకులతో క్లాసులు బోధిస్తున్నాం. వాటిని రికార్డ్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాం. 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించి సివిల్ సర్వీసెస్, ఫౌండేషన్ కోర్సులు నిర్వహిస్తూ వాటిని సైతం అప్‌లోడ్ చేస్తాం. మొత్తం 12 స్టడీసర్కిళ్లలో చాలామంది ఎక్స్‌పర్ట్స్ పాఠాలు చెబుతున్నారు. ఆయా సబ్జెక్టుల వీడియోలను ఉద్యోగార్థులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నాం.:- మామిడి హరికృష్ణ, బీసీ స్టడీ సర్కిళ్ల డైరెక్టర్

Next Story