పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ పాఠశాలలు.. అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-16 01:53:01  IST  )

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు నేడు ధనార్జన, వ్యాపార నిలయాలుగా మారుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.

పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ పాఠశాలలు.. అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన
X

దిశ, కామారెడ్డి : విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు నేడు ధనార్జన, వ్యాపార నిలయాలుగా మారుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కనీస నిబంధనలను పాటించకుండానే అడ్మిషన్ల పేరిట దోపిడీకి తెర లేపుతున్నారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ కరువవడంతో సామాన్య, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల జేబులకు చిల్లు పడుతుంది... ఇదిలా ఉంటే చాలామంది తల్లిదండ్రులు కేవలం సామాజిక హోదా కోసం మాత్రమే ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పిస్తున్నారని పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో లేని సామాజిక హోదా ప్రైవేటు పాఠశాలల్లో ఏముంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు. కనీస విద్యార్హత లేని, అనర్హత గల ఉపాధ్యాయుల బోధనలో అన్ని అర్హతలు ఉండి ఉన్నత స్థాయిలో ఉన్న వారు కూడా తమ పిల్లలను చేర్పించడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అనుమతులు లేకుండానే అడ్డగోలుగా పాఠశాలలు...

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రతి వీధిలోను ఒక ప్రైవేటు పాఠశాల వెలుస్తోంది. ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఏ పాఠశాల వెలవడం లేదు. కేవలం వ్యాపార దృక్పథంతోనే కొత్త పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. వీటికి సరైన ప్రభుత్వ గుర్తింపు ఉన్నదా లేదా అన్నది ప్రశ్నార్థకంగానే మారింది. వచ్చేనెల జూన్ 12 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇరుకు గదులు, కనీస సౌకర్యాలు లేని భవనాల్లోనూ ఆకర్షణీయమైన ప్రచారాలతో అడ్డగోలుగా అడ్మిషన్లు స్వీకరిస్తున్నారు. కొన్నిచోట్ల బ్రాండెడ్ సంస్థల పేర్లను వాడుకుంటూ తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నారు.

నిబంధనలు గాలికి...

పాఠశాలలు స్థాపించాలంటే ముందుగా విద్యాశాఖ నిబంధనల ప్రకారం నిర్ణీత రుసుము చెల్లించి అనుమతులు పొందాలి. పట్టణాల్లో అయితే 1000 చదరపు మీటర్లు, గ్రామాల్లో అయితే 2000 చదరపు మీటర్ల ఆటస్థలం ఉండాలి. అంతేకాకుండా అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఇవే కాకుండా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వేరువేరుగా మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలి. లైబ్రరీ ప్రసార సాధనాలు తప్పకుండా ఉండాలి. 50 వేల రూపాయల ఎండోమెంట్ రుసుము చెల్లించాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. చాలా పాఠశాలలకు కనీస ఆటస్థలాలు కూడా లేవు. తప్పనిసరిగా టీవీ, రేడియో వంటి ప్రసార సాధనాలు అందుబాటులో ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ చాలా పాఠశాలల్లో ఈ నిబంధనలకు విరుద్ధంగా విద్యాబోధన జరుగుతుంది.

విద్యార్థుల భవిష్యత్తు అంధకారమే..

ఇక అనుమతులు లేని పాఠశాలల్లో చేరితే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. భవిష్యత్తులో బోనాపైడ్ అందక వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అప్పర్ ప్రైమరీ, ప్రైమరీ, ఉన్నత పాఠశాలలకు కొన్నింటికి అసలు అనుమతులే లేవని తెలుస్తోంది. కొన్ని పాఠశాలలకు అనుమతులు ఉండగా అనుమతులు లేని పాఠశాలల యాజమాన్యాలు అనుమతులు ఉన్న పాఠశాలల పేరిట అడ్మిషన్లు తీసుకొని తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నారు. అయినా విద్యాశాఖ అధికారులు ఇవేమీ పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.

అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన

ప్రైవేటు పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులు భావిస్తుంటే యాజమాన్యాలు మాత్రం తక్కువ జీతాలకే లభించే అనర్హులైన వారిని ఉపాధ్యాయులుగా నియమించుకుంటున్నారు. ప్రాథమిక స్థాయికి డీఈడీ, ఉన్నత తరగతులకు బీఈడీ అర్హత ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ కేవలం ఇంటర్, డిగ్రీ చదివిన వారితోనే పాఠాలు బోధిస్తున్నారు. దీనిపైన కూడా విద్యాశాఖ తనిఖీ లేకపోవడంతోనే యాజమాన్యాలు తక్కువ జీతాలు ఇచ్చి అర్హత లేని ఉపాధ్యాయులను నియమించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఫీజుల బాధుడు

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల బాదుడు కు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కనీస మినిమం ఫీజు ఇంత ఉండాలని నిబంధనలు లేకపోవడంతో ఒక్కో పాఠశాలలో ఒక్కోరకంగా తమకు నచ్చినట్టుగా ఫీజులను తల్లిదండ్రుల వద్ద నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఎల్కేజీ చదివే విద్యార్థి సీటుకు 20వేల నుంచి 30 వేల వరకు వసూలు చేస్తున్నారంటే ఉన్నత చదువులు చదివే విద్యార్థుల వద్ద నుంచి ఎంత మేర ఫీజులు వసూలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

టై, షూస్, బెల్టుల మోజులో పడి మోసపోతున్న తల్లిదండ్రులు

టై, షూస్, బెల్టుల మోజులో పడి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను కాదని ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేవలం సామాజిక హోదా కోసం మాత్రమే ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సామాజిక హోదా కోసం కాకుండా పిల్లల భవిష్యత్తు కోసం అర్హత గల ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలను ఎంచుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులు

ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందుతుంది. ప్రభుత్వం టెట్, బీఈడీ వంటి కఠిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన నైపుణ్యం గల ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలల్లో నియమిస్తున్నారు. అంతేగాకుండా విద్యార్థులకు ఉచితంగా భోజనం, అల్పాహారం, పాఠ్యపుస్తకాలు వంటి వసతులను కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. అయినా ఇవేవీ తల్లిదండ్రులకు కనిపించకపోవడం శోచనీయం.

విద్యాశాఖ అధికారుల తీరుపై ఆరోపణలు

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున వెలుస్తున్న అక్రమ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు దృష్టి పెట్టకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అక్రమంగా వెలుస్తున్న పాఠశాలలపై దృష్టి సారించాలని, అలాగే కనీస సౌకర్యాలు, వసతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలు, అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయిస్తున్న పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Next Story