కాలానికి అనుగుణంగా బోధనా పద్దతులు మెరుగుపరుచుకోవాలి: విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా

by Ajay Maddhiboyina |

ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగేలా ప్రతి ఉపాధ్యాయుడు తమ భోధనా పద్దతులను కాలానికి అనుగుణంగా మెరుగు పరుచుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సూచించారు.

కాలానికి అనుగుణంగా బోధనా పద్దతులు మెరుగుపరుచుకోవాలి: విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగేలా ప్రతి ఉపాధ్యాయుడు తమ భోధనా పద్దతులను కాలానికి అనుగుణంగా మెరుగు పరుచుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సూచించారు. మంగళవారం ఆమె మండల స్థాయి శిక్షణ కార్యక్రమాలలో పాల్గొంటున్న 89,378 మంది ఉపాధ్యాయులను ఉద్దేశించి జూమ్ మీటింగ్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఉపాధ్యాయులందరూ ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని పిలుపునిచ్చారు. టీచర్లందరూ ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో అమలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని విద్యా ప్రమాణాల పరంగా ముందువరుసలో నిలబెడతారనే నమ్మకం, విశ్వాసం తనకు ఉందని ఆమె వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అన్ని స్కూళ్లలో బెస్ట్ ప్రాక్టిసెస్ అమలు:

చాలా మంది టీచర్లు తమ బెస్ట్ ప్రాక్టిసెస్ ద్వారా విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచారని, తద్వారా పాఠశాల నమోదును కూడా పెంచారని డా. యోగితా రాణా ప్రశంసించారు. రంగయ్య, రవిరాజు, భవాని వంటి టీచర్లు ఇందుకు ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. ఉత్తమ అభ్యాసాలను(బెస్ట్ ప్రాక్టిసెస్) అమలుచేస్తున్న టీచర్స్ నుండి వివరాలు సేకరించి, వారితో త్వరలో రాష్ట్రస్థాయిలో సమ్మేళనం నిర్వహించబోతున్నామని తెలిపారు. తద్వారా ఈ బెస్ట్ ప్రాక్టిసెస్ ను రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు పరిచే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని ఆమె వెల్లడించారు. ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచడానికి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ ఎల్ ఎన్) కార్యక్రమానికి అత్యధిక ప్రాముఖ్యతనిచ్చి విద్యార్థులందరూ ధారాళంగా చదవడం, రాయడం వంటి అంశాలపై ఉపాధ్యాయులందరూ ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో టీచర్లకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పించాల్సిందిగా డిఈవోలను, శిక్షణా కేంద్రాల ఇన్చార్జిలను ఆమె ఆదేశించారు. టీచర్ల హాజరు, ఫీడ్‌బ్యాక్ మొబైల్ యాప్ ద్వారా సేకరిస్తామని, శిక్షణ పూర్తయిన ఐదు రోజుల తర్వాత ట్రైనింగ్ సర్టిఫికెట్ కూడా ఆటోమేటిక్‌గా మొబైల్ యాప్‌లోనే జనరేట్ అవుతుందని తెలిపారు.

ఐదురోజుల శిక్షణ కార్యక్రమం:

రాష్ట్రంలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తం 1,22,000 మంది ఉపాధ్యాయులకు బోధనా సమయం వృధా కాకుండా వేసవి సెలవుల్లో ఈ శిక్షణను నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మే 13 నుంచి 17 వరకు జరిగిన మొదటి విడతలో 17,771 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందారు. రెండో విడత మే 20 నుంచి 24 వరకు జరుగుతోంది.

Next Story