- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెట్ మినహాయింపు ఇవ్వాలి.. ఢిల్లీ లో కదం తొక్కిన ఉపాధ్యాయులు
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో ఉపాధ్యాయ లోకం కదం తొక్కింది.

దిశ, తెలంగాణ బ్యూరో: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో ఉపాధ్యాయ లోకం కదం తొక్కింది. ఆల్ ఇండియా జాక్టో పిలుపు మేరకు గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మంది ఉపాధ్యాయులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ఎంపీలు, రాజకీయ నాయకులు హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారు. విద్యా హక్కు చట్టం 2010 లోని సెక్షన్ 23 ను సవరించి, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు పరీక్ష నుండి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అందరూ కూడా తప్పనిసరిగా టెట్ రాయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలన్నారు. ఈ ధర్నాకు ఆల్ ఇండియా జాక్ తో స్టీరింగ్ కమిటీ సభ్యులు సీఎన్ భార్తి, చావరవి కత్తి నరసింహారెడ్డి, సదానంద గౌడ్‌లు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ ధర్నాకి వేలాది మంది ఉపాధ్యాయులు తరలివచ్చి, నినాదాలతో హోరెత్తించారు.
ఈ ధర్నా శిబిరానికి కేరళ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు జాన్ బ్రిటిష్, శివ దాసన్, తమిళనాడు నుంచి సెల్వరాజ్, కర్ణాటక నుండి కుమార్‌నాయక్, బీహర్ నుండి రాజారామ్ సింగ్, సిపిఐ నాయకులు నారాయణ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి. వెంకట్, ప్రపంచ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు అమియ కుమార్, వివిధ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల నాయకులు తదితరులు మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయులను పరీక్షల పేరుతో ఆందోళన గురి చేయడం సరికాదని సుప్రీంకోర్టు తీర్పు అమలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని చట్టాన్ని సవరించాలని అందుకోసం పార్లమెంటులో ఉపాధ్యాయుల పక్షాన పోరాడుతామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకులు కె. నారాయణ, తెలుగు రాష్ట్రాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు గోపి మూర్తి (ఆంధ్రప్రదేశ్), శ్రీపాల్ రెడ్డి (తెలంగాణ), స్టీరింగ్ కమిటీ సభ్యులు చావా రవి, సదానందం గౌడ్, పి. దామోదర్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని నేతలు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, ఈ ఐక్య పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి హెచ్చరించారు. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లలో ప్రధానంగా పాత పెన్షన్ పునరుద్దరణ, ఎన్ఈపీ 2020 ఉపసంహరణ, పాఠశాలల విలీనం ఆపడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించడం, ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించడం, రెగ్యులరైజేషన్ తదితర అంశాలను లేవనెత్తారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల గౌరవాన్ని అన్యాయంగా తగ్గించే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం టెట్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు. టెట్ అర్హత దేశంలో సుమారు 25 లక్షల మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు గుదిబండగా మారిందని అన్నారు. ఉపాధ్యాయుల హక్కులు, ప్రయోజనాల కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.






