బడికి రాని పంతులు..! వాగుల్లో చేపల వేటలో గిరిజన విద్యార్థులు

by Ramesh Naini |

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యావ్యవస్థ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బడికి రాని పంతులు..! వాగుల్లో చేపల వేటలో గిరిజన విద్యార్థులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యావ్యవస్థ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా గిరిజన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. తాజాగా వాంకిడి మండలంలోని రింగ్‌రైట్ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు విధులకు హాజరుకాకపోవడంతో బడికి తాళం పడింది. ఉదయాన్నే బడికి వెళ్లి చదువుకోవాల్సిన ఆ చిన్నారి గిరిజన విద్యార్థులు, పాఠశాల తెరుచుకోకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. పుస్తకాలు చేతబట్టాల్సిన ఆ పసి చేతులు.. సమీపంలోని వాగుల్లో చేపల వేటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. చదువుల తల్లి ఒడిలో ఉండాల్సిన చిన్నారులు ఇలా వాగుల వెంట చేపలు పడుతూ కనిపించడం స్థానికులను తీవ్రంగా కలిచివేస్తోంది.

అయినా మారని తీరు..

ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరుపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, సదరు ఉపాధ్యాయుడు గతంలో కూడా విధులకు గైర్హాజరైన సందర్భాలు ఉన్నాయని, అప్పట్లో ఆయనకు అధికారులు మెమో జారీ చేసినట్లు స్థానికుల సమాచారం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story