- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ మోడ్‍లోకి టీడీపీ.. మహానాడు వేదికగా నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో టీడీపీ పునర్వైభవంపై నారా లోకేశ్ మహానాడు వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచే తన పని మొదలు పెట్టబోతున్నారా అనే చర్చ తెరమీదకు వస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీ (TDP) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికే పరిమితం అయింది. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పరిణామాలతో క్రమంగా తెలంగాణ ప్రాంతంలో రాజకీయ కార్యక్రమాలను తగ్గించుకున్న ఆ పార్టీ.. ఇప్పుడు తిరిగి తెలంగాణ గడ్డపై దృష్టి సారించింది. తెలంగాణలో అస్తిత్వం కోల్పోతున్న టీటీడీపీకి మళ్లీ పునర్వైభవం తీసుకురావాలనే వ్యూహంలో భాగంగా సరికొత్త ఆలోచనతో ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్‍లో ప్రారంభమైన టీడీపీ ఆవిర్భావ వేడుక మహానాడులో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ (Nara Lokesh) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‍గా మారాయి.
తెలంగాణ బాధ్యత నాదే:
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‍గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి మహానాడులో ప్రసంగించిన నారా లోకేశ్ టీడీపీ విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‍గా తెలంగాణతో పాటు అండమాన్‍లోనూ టీడీపీని బలోపేతం చేసే బాధ్యత నాపై ఉందన్నారు. త్వరలోనే అక్కడి నాయకులు, కార్యకర్తలను కలుస్తానన్నారు. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లోని పార్టీ శ్రేణులు జయప్రదం చేద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి మళ్లీ టీడీపీకీ పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కలిసిట్టుగా పని చేస్తామని పార్టీ శ్రేణులకు ఆయన హామీ ఇచ్చారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచే షురూ?:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 15 స్థానాలు గెలుచుకుని తన సత్తా చాటుకుంది. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో మహాకూటమి (కాంగ్రెస్ + టీడీపీ + సీపీఐ + టీజేఎస్) తరఫున 13 స్థానాల్లో పోటీ చేసి 2 సీట్లకే పరిమితం అయింది. ఇక 2023 ఎన్నికల్లో మొదట పోటీ చేయాలని భావించినప్పటికీ అప్పటి రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై దృష్టి పెట్టడం వల్ల చివరి నిమిషంలో తెలంగాణ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకుంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన జోష్ లో ఉన్న సైకిల్ పార్టీ ఆ తర్వాత తెలంగాణపై దృష్టి సారించినా అది రెండు మూడు సమావేశాలకే పరిమితం అయింది. కానీ ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు నివాసానికి వెళ్లడం, మహానాడు వేదికగా తెలంగాణ బాధ్యత నేను తీసుకుంటానని లోకేశ్ ప్రకటించడం వెనుక టీడీపీ బలమైన వ్యూహంతో తెలంగాణలో రీ ఎంట్రీ ఇవ్వబోతోందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారానే తెలంగాణలో తిరిగి కాలు మోపబోతోందనే టాక్ వినిపిస్తోంది.
సైకిల్ ఎంట్రీతో మారనున్న సమీకరణాలు?:
తెలంగాణ ప్రాంతంలో టీడీపీకి ఇప్పటికీ క్షేత్రస్థాయి వరకు సానుభూతి పరులు ఉన్నారు. పార్టీ అధిష్టానం సీరియస్‍గా దృష్టి సారిస్తే క్యాడర్ అంతా యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో టీడీపీ బీ ఫామ్స్ కోసం నేతలు ప్రయత్నించడం ఆ పార్టీకి ఉన్న మద్దతు ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు యాక్టివ్‍గా వ్యవహిరస్తున్నారు. 2029 ఎన్నికల వరకు అక్కడ కూటమి ప్రభుత్వానికి తిరుగులేదు. ఆలోపు లోకేశ్ తెలంగాణ ప్రాంతంపై దృష్టి సారిస్తే పార్టీల మధ్య ఓట్ పర్సంటేజ్ పై ప్రభావం చూపి ఏకంగా రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశంఉందనే చర్చ జరుగుతోంది. మరి మహానాడు వేదికగా చెప్పినట్లు లోకేశ్ తెలంగాణ ప్రాంతాన్ని సీరియస్‍గా పట్టించుకుంటారా? ఈ ప్రాంతంపై ఎలాంటి వ్యూహంతో ఉన్నారు? అనేది కాలమే నిర్ణయించనుంది.






