గోదావరి-కావేరి లింక్‌పై టాస్క్‌ఫోర్స్ సమావేశం

by Ajay Maddhiboyina |

భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ జల అభివృద్ధి సంస్థ గోదావరి (ఇచ్చంపల్లి) - కావేరి (గ్రాండ్ ఆనకట్ట) నదుల అనుసంధాన ప్రాజెక్టులపై రాష్ట్రాలతో ఏకాభిప్రాయానికి రావడానికి

గోదావరి-కావేరి లింక్‌పై టాస్క్‌ఫోర్స్ సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ జల అభివృద్ధి సంస్థ గోదావరి (ఇచ్చంపల్లి) - కావేరి (గ్రాండ్ ఆనకట్ట) నదుల అనుసంధాన ప్రాజెక్టులపై రాష్ట్రాలతో ఏకాభిప్రాయానికి రావడానికి 6వ సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించనుంది. వచ్చే నెల 24న హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ జలసౌధలో ఈ సమావేశం జరగనుంది. టాస్క్‌ఫోర్స్ చైర్మన్, సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని సంబంధిత వర్గాలను కోరుతూ జాతీయ జల అభివృద్ధి సంస్థ పేర్కొంది. ఈ సమావేశంలో గోదావరి-కావేరీ అనుసంధానంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లేవనెత్తిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది నుంచి కావేరీ బేసిన్‌కు నీటిని మళ్లించాలని కేంద్రం ప్రతిపాదించింది. అయితే.. తెలంగాణ తన నీటి అవసరాలను తీర్చిన తర్వాతే మిగులు జలాలను మళ్లించాలని, ప్రాజెక్టు వల్ల తమ ప్రయోజనాలకు నష్టం జరగకూడదని డిమాండ్ చేస్తున్నది. ఛత్తీస్‌గఢ్‌కు కేటాయించిన 148 టీఎంసీల వినియోగించని నీటి వాటాపై కూడా తెలంగాణ అభ్యంతరాలు తెలిపింది. అలాగే.. ఆంధ్రప్రదేశ్ పోలవరం నుంచి అనుసంధానాన్ని చేపట్టాలని, సోమశిల జలాశయాన్ని కూడా ప్రాజెక్టులో చేర్చాలని సూచించింది. ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధిత రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం చాలా కీలకమని జలశక్తి మంత్రిత్వ శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. గతంలో జరిగిన సమావేశాల్లోనూ రాష్ట్రాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఈ కీలక సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరి, ప్రాజెక్టు ముందుకు సాగుతుందో లేదో చూడాలి.

Next Story