ఐటీ హబ్ వరదకు తమ్మిడికుంటే పరిష్కారం.. అధికారుల కీలక ఆదేశాలు

by Ramesh Naini |

మాదాపూర్‌లోని సున్నం చెరువుతో పాటు త‌మ్మిడికుంట ప‌రిస‌రాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్‌, సీఎంసీ క‌మిష‌న‌ర్ సృజ‌న సోమ‌వారం ప‌రిశీలించారు.

ఐటీ హబ్ వరదకు తమ్మిడికుంటే పరిష్కారం.. అధికారుల కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ‌ర‌ద నీరు నేరుగా చెరువుల్లోకి చేరేందుకు హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇన్‌లెట్ల‌లోకి ఫీడ‌ర్ ఛాన‌ళ్ల ద్వారా వ‌ర‌ద నీరు చేరేలా వాటిని అభివృద్ధి చేస్తోంది. ఈ క్ర‌మంలో మాదాపూర్‌లోని సున్నం చెరువుతో పాటు త‌మ్మిడికుంట ప‌రిస‌రాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్‌, సీఎంసీ క‌మిష‌న‌ర్ సృజ‌న సోమ‌వారం ప‌రిశీలించారు. సున్నం చెరువు చెంత‌న ఉన్న బోర‌బండ బ‌స్తీ, ఎన్ఆర్ఆర్ పురం నుంచి వ‌చ్చే వ‌ర‌ద నీరు నేరుగా ఇన్‌లెట్ల ద్వారా చెరువులోకి క‌లిసేలా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను క్షేత్ర స్థాయిలో స‌మీక్షించారు. ఆ ఇన్‌లెట్ల‌తో వ‌ర‌ద కాలువ‌ల అనుసంధానం గురించి చ‌ర్చించారు. మురుగు నీరు డైవ‌ర్ట్ చేసిన పైపుల‌ ద్వారా కిందకు వెళ్లేలా.. వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడు వ‌ర‌ద నీరు నేరుగా చెరువులోకి చేరేలా చేయాల్సిన‌ ఏర్పాట్ల‌ను క్షేత్ర స్థాయిలో త‌నిఖీ చేశారు. అలాగే మాదాపూర్ - బోర‌బండ మీదుగా హైటెన్ష‌న్ వైర్ల కింద నుంచి వెళ్లే రోడ్డు విస్త‌ర‌ణ అంశాన్ని కూడా ప‌రిశీలించారు. చెరువులు నిండిన‌ప్పుడు ఔట్‌లెట్ల ద్వారా విడుద‌ల చేసిన నీరు వెళ్లేందుకు ఉద్దేశించిన కాలువ‌ల విస్త‌ర‌ణ‌పైనా చ‌ర్చించారు.

త‌మ్మిడికుంట ఇన్‌లెట్ల‌ ప‌రిశీల‌న‌..

భారీ వ‌ర్షం ప‌డితే కొండాపూర్‌, ఐటీ హ‌బ్ నుంచి వ‌చ్చే వ‌ర‌దతో శిల్పారామం, మెట‌ల్ చార్మినార్ ప‌రిస‌రాలు జ‌ల‌మ‌యం అవుతాయి. ఈ వ‌ర‌ద నీరు నేరుగా త‌మ్మిడికుంట‌కు చేరేలా ఇన్లెట్ల‌ను ఏర్పాటు చేశారు. పైనుంచి వ‌ర‌ద నేరుగా ఇన్‌లెట్ల ద్వారా చెరువులోకి చేరేలా కాలువ‌ల అనుసంధానం జ‌రిగేలా చూడాల‌ని ఇరువురు క‌మిష‌న‌ర్లు అధికారుల‌ను ఆదేశించారు. మెట‌ల్ చార్మినార్ రోడ్డులో వ‌ర‌ద నేరుగా త‌మ్మిడికుంట‌లో క‌లిసేలా అటువైపు ఉన్న ఇన్‌లెట్ల‌ను వినియోగించుకోవాల్సి ఉంద‌ని.. అవ‌స‌ర‌మైతే ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు ద్వారా వ‌ర‌ద కాలువ‌ల‌ను అభివృద్ధి చేయాల‌ని సూచించారు. చెరువు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌తో.. గ‌త వ‌ర్షాకాలంలో వ‌ర‌ద నేరుగా త‌మ్మిడికుంట‌కు చేరింద‌ని.. ఇప్పుడు కాలువ‌ల అనుసంధానంతో స‌మ‌స్య‌కు పూర్తి స్థాయిలో చెక్ పెట్ట‌వ‌చ్చని ఇరువురు క‌మిష‌న‌ర్లు భావించారు. త‌మ్మిడికుంట‌, సున్నం చెరువుల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గింపుతో పాటు.. విస్త‌ర‌ణ‌కు సంబంధించిన అంశాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్‌ను సీఎంసీ క‌మిష‌న‌ర్ అడిగి తెలుసుకున్నారు.

Next Story