హైదరాబాద్‌కు చేరుకున్న తమిళనాడు ఎమ్మెల్యేలు.. చివరి నిమిషంలో క్యాంప్ పాలిటిక్స్!

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-08 17:21:54  IST  )

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ ఇప్పుడు తెలంగాణ గడ్డకు చేరింది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (TNCC) అప్రమత్తమైంది.

హైదరాబాద్‌కు చేరుకున్న తమిళనాడు ఎమ్మెల్యేలు.. చివరి నిమిషంలో క్యాంప్ పాలిటిక్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ ఇప్పుడు తెలంగాణ గడ్డకు చేరింది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (TNCC) అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరినీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఈ ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ రిసార్ట్‌లో బస చేయనున్నారు. ఇప్పటికే నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీకి కాంగ్రెస్ అధికారికంగా మద్దతు ప్రకటించింది. తమిళనాడులో మెజారిటీ నిరూపించుకోవడానికి ఒక్కో ఎమ్మెల్యే మద్దతు అత్యంత కీలకంగా మారింది. ఈ క్రమంలో ఇతర పార్టీలు తమ ఎమ్మెల్యేలకు గాలం వేసే అవకాశం ఉందన్న ఆందోళనతో కాంగ్రెస్ అధిష్టానం ఈ ‘క్యాంప్ రాజకీయం’ మొదలుపెట్టింది.

తమిళనాడులో ఉత్కంఠ.. తెలంగాణలో నిఘా..

ప్రస్తుతం తమిళనాడులో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడం, ఐయూఎంఎల్ వంటి పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలతో కాంగ్రెస్ జాగ్రత్త పడుతోంది. విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఎమ్మెల్యేలను ఇక్కడికి తరలించినట్లు సమాచారం. లోక్‌భవన్‌లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయ్యి, బలపరీక్ష ముగిసే వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉంటారని తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో, ఇక్కడ తమ ఎమ్మెల్యేలకు పూర్తి రక్షణ ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. మొత్తానికి తమిళ పీఠం దక్కించుకోవడానికి జరుగుతున్న ఈ చదరంగంలో హైదరాబాద్ ఇప్పుడు ప్రధాన కేంద్రంగా మారింది.

Next Story