ప్రయోగాత్మక జ్ఞానం పొందేలా టీ-స్టెమ్ కార్యక్రమం

by Muthe.Rajitha |

రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ, ఇంటర్మీడియట్ విద్యా శాఖ టీ-స్టెమ్ (తెలంగాణ- సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఫెసిలిటీస్ మ్యాప్ ) కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించింది.

ప్రయోగాత్మక జ్ఞానం పొందేలా టీ-స్టెమ్ కార్యక్రమం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ, ఇంటర్మీడియట్ విద్యా శాఖ టీ-స్టెమ్ (తెలంగాణ- సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఫెసిలిటీస్ మ్యాప్ ) కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) రూపకల్పన చేసిన ఈ డిజిటల్ వేదిక, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఇతర విద్యా సంస్థలలోని వృత్తి సంబంధిత ప్రయోగశాలల వసతులను మ్యాపింగ్ చేయడం, విద్యార్థులు వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, ఇది విద్యలో కొత్త ఆరంభమని, పాఠశాల నుండి పట్టభద్ర స్థాయి వరకు ప్రతి విద్యార్థి ప్రయోగాత్మక జ్ఞానం పొందేలా రూపొందించబడిందని పేర్కొన్నారు.

టీ-స్టెమ్ కేవలం డిజిటల్ మౌలిక వేదిక మాత్రమే కాకుండా, అనుభవాధారిత విద్య కోసం స్థిరమైన, సహకారపూర్వకమైన వాతావరణాన్ని నిర్మించేందుకు దూరదృష్టితో చేసిన ప్రయత్నమని ఆమె తెలిపారు. టీ-స్టెమ్ పోర్టల్ ద్వారా ఆరు రంగాలలోని 22 వృత్తి కోర్సులు, సాధారణ కోర్సులకు సంబంధించిన ప్రయోగశాలల మౌలిక వసతుల డిజిటల్ మ్యాపింగ్ సదుపాయం లభిస్తుంది. ఇది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ లు, విశ్వవిద్యాలయాల మధ్య వనరులు పంచుకోవడం, ల్యాబ్ స్లాట్ బుకింగ్, అనుమతుల వర్క్ఫ్లోలను సులభతరం చేస్తుంది. అదనంగా, ఇందులో ల్యాబ్ గ్రేడింగ్, ప్రమాణాలు, అలాగే నిరంతర అభివృద్ధి కోసం అభిప్రాయ సేకరణ వ్యవస్థలు కూడా ఉన్నాయి.

విజయవంతమైన ట్రయల్ రన్:

అక్టోబర్ 23 న నిర్వహించిన ట్రయల్ రన్ లో నాలుగు విద్యాసంస్థల నుండి పది మంది విద్యార్థులు చొప్పున పాల్గొని భాగస్వామ్య కళాశాలల్లో ప్రయోగాత్మక శిక్షణ పొందారు. కూకట్ పల్లి జూనియర్ కళాశాల విద్యార్థులు గోకరాజు రంగారాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వద్ద కంప్యూటర్ సైన్స్ ల్యాబ్‌లో హెచ్ టీఎంఎల్, సీఎస్ఎస్ శిక్షణ పొందారు. నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులు మాసబ్ ట్యంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ల్యాబ్‌లో శిక్షణ తీసుకున్నారు.

గుణగల్ టీఎస్ఎంఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులు గురు నానక్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాలపై శిక్షణ పొందారు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ విద్యార్థులు జి. నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వద్ద త్రీడీ ప్రింటింగ్ అండ్ ఏఐఎంఎల్ గ్రాఫిక్ సర్వర్‌పై శిక్షణ తీసుకున్నారు. అధునాతన ప్రయోగశాలల అనుభవం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేయగా, లెక్చరర్లు ఈ వేదిక ద్వారా సమన్వయం సులభతరమైందని అభిప్రాయపడ్డారు. అయితే, ఆటోమేటెడ్ గేట్ పాస్ జనరేషన్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు, సమన్వయాధికారి సంప్రదింపు వివరాలు పోర్టల్లో కనిపించే విధంగా ఉండాలని పాల్గొన్నవారు సూచించారు.

రాష్ట్రవ్యాప్త విస్తరణ:

ఈ ట్రయల్ విజయవంతంతో, టీ-స్టెమ్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇది విద్యా సంస్థల మధ్య వనరుల లోటును పూరించడం, వృత్తి విద్యను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, ఆవిష్కరణ, సహకార సంస్కృతిని పెంపొందించడం లక్ష్యంగా కొనసాగుతుంది. ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ, టీ-స్టెమ్ ద్వారా మనం కేవలం మౌలిక వసతులను డిజిటల్గా నిర్వహించడం మాత్రమే కాదు, విద్యార్థులు ప్రయోగాపుర్వక జ్ఞానాన్ని సులభంగా పొందేందుకు అవకాశాలను కల్పిస్తున్నాము. ఇది వారిని విద్యా పరంగా మెరుగుపరచడంలో శక్తివంతంగా పనిచేస్తుంది అని తెలిపారు.

Next Story