నెగెటివ్ మార్కులతో కూడా అర్హత.. నీట్-పీజీ కటాఫ్ సున్నాకు తగ్గించడంపై టీ-ఎస్ఆర్డీఏ ఆందోళన

by Ajay Maddhiboyina |

నీట్ పీజీ 2025-26 ప్రవేశ పరీక్షలో అర్హత కట్ ఆఫ్‌ను సున్నా శాతం (జీరో పర్సంటైల్)కు తగ్గిస్తూ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ (టీ-ఎస్ఆర్డీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

నెగెటివ్ మార్కులతో కూడా అర్హత.. నీట్-పీజీ కటాఫ్ సున్నాకు తగ్గించడంపై టీ-ఎస్ఆర్డీఏ ఆందోళన
X

దిశ, తెలంగాణ బ్యూరో: నీట్ పీజీ 2025-26 ప్రవేశ పరీక్షలో అర్హత కట్ ఆఫ్‌ను సున్నా శాతం (జీరో పర్సంటైల్)కు తగ్గిస్తూ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ (టీ-ఎస్ఆర్డీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై టీ-ఎస్ఆర్డీఏ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఫిర్యాదు చేసింది. జనవరి 13, 2026న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా అన్ని కేటగిరీలకు కట్ ఆఫ్‌ను సున్నా శాతానికి తగ్గించారని, దీని వల్ల మైనస్ 40 మార్కుల వరకూ వచ్చిన అభ్యర్థులు కూడా పీజీ ప్రవేశాలకు అర్హులవుతారని టీ-ఎస్ఆర్డీఏ లేఖలో పేర్కొంది. ఈ నిర్ణయంతో నెగెటివ్ మార్కులు వచ్చిన అభ్యర్థులు కూడా అర్హత సాధించే అవకాశం రావడంపై టీ-ఎస్ఆర్డీఏ తీవ్ర అభ్యంతరం తెలిపింది. నీట్ పీజీ దేశవ్యాప్తంగా పోటీతత్వంతో జరిగే కీలక ప్రవేశ పరీక్ష అని... ఇది పీజీ వైద్య విద్యలో ప్రతిభ, ప్రమాణాలను కాపాడే ప్రధాన ఫిల్టర్ అని టీ-ఎస్ఆర్డీఏ అభిప్రాయపడింది. అలాంటి పరీక్షలో కట్ ఆఫ్‌ను పూర్తిగా సున్నాకు తగ్గించడం ద్వారా అకడమిక్ ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో తయారయ్యే స్పెషలిస్టుల నాణ్యత, రోగుల భద్రతపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ), నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) వెంటనే ఈ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని టీ-ఎస్ఆర్డీఏ డిమాండ్ చేసింది. వైద్య విద్యా వ్యవస్థపై ప్రజల నమ్మకం నిలబడాలంటే, ప్రతిభ ఆధారితమైన సమంజసమైన కట్ ఆఫ్‌ను తిరిగి అమలు చేయాలని సంఘం విజ్ఞప్తి చేసింది.

ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ప్రయోజనం చేకూర్చేందుకే...

నెగెటివ్ మార్కులతో ఉన్న అభ్యర్థులను పీజీ వైద్య శిక్షణకు అనుమతించడం ఎలాంటి అకడమిక్ లేదా నైతిక ప్రమాణాలకు సరిపోదని, ఇది దేశంలోని వైద్య విద్యా వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని టీ-ఎస్ఆర్డీఏ స్పష్టం చేసింది. ప్రత్యేకంగా ప్రభుత్వ మరియు బోధనా ఆసుపత్రులపై ఆధారపడే పేద, బలహీన వర్గాల ప్రజల ఆరోగ్య భద్రతకే ఇది ముప్పుగా మారుతుందని హెచ్చరించింది. ఖాళీ సీట్లు భర్తీ చేయడం కోసం ప్రమాణాలు తగ్గించడం ప్రైవేటు మెడికల్ కాలేజీలకు లాభం చేకూర్చడమే తప్ప, దేశ ప్రయోజనాలకు హానికరమని టీ-ఎస్ఆర్డీఏ అభిప్రాయపడింది. కట్ ఆఫ్‌పై వెంటనే సవరణ చేయకపోతే, దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్ల సంఘాలతో కలిసి ఉద్యమాలకు దిగుతామని కూడా టీ-ఎస్ఆర్డీఏ తన లేఖలో స్పష్టం చేసింది.

Next Story