మహిళామణులకు తీపి కబురు.. విజయదశమికి చీరల పంపిణీ!

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున చీరలు పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

మహిళామణులకు తీపి కబురు.. విజయదశమికి చీరల పంపిణీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున చీరలు పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే సిరిసిల్లలో పవర్‌ లూం మీద చీరలు తయారు చేయిస్తున్నట్లు తెలిసింది. 65 లక్షల మందికి రెండు చొప్పున 1.30 కోట్ల చీరలు అవసరం అవుతాయి. ఈ మేరకు 4 కోట్ల మీటర్ల చీరలు అవసరం పడతాయని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో కోటి మీటర్ల చీరలు తయారై ప్రాసెసింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన వాటి తయారీ కొనసాగుతున్నది. సిరిసిల్లలో రోజుకు సుమారు 5 వేల మంది పవర్​లూం కార్మికులు దీనికి సంబంధించిన వర్క్ చేస్తున్నట్లు తెలిసింది.

సెప్టెంబర్​ చివరి కల్లా తయారీ లక్ష్యం

ప్రభుత్వం పంపిణీ చేయనున్న చీరలు సెప్టెంబర్​చివరి కల్లా రెడీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అప్పటి కల్లా తయారీ ప్రక్రియ పూర్తవుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. చీరల తయారీ కోసం బీసీ సంక్షేమ శాఖ ఇప్పటికే రూ.318 కోట్లు విడుదల చేసింది. చీరల డిజైన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఖరారు చేశారు. ఈ సారి దసరాకు.. లేదా ప్రభుత్వం నిర్ణయించే మరో తేదీలో చీరలను పంపిణీ చేయనున్నారు.

సిరిసిల్లలో సాంచాల సవ్వడి

ఈ చీరలను ప్రభుత్వం సిరిసిల్ల జిల్లాలో తయారు చేయిస్తున్నది. సర్కారు నిర్ణయంతో ఆ జిల్లాలో సాంచాల సవ్వడి మొదలైంది. నెల రోజులుగా పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఒక్కో కార్మికుడు వారానికి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ సంపాదిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా తమకు ఉపాధి సమస్య తీరిందని కార్మికులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో మహిళకు ఒక చీరే ఇవ్వగా.. కాంగ్రెస్​ప్రభుత్వం మాత్రం రెండు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

Next Story