- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తీపికబురు.. ఇక చౌకగా స్టీల్, సిమెంట్!
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పథకం లక్ష్యం చేరుకునేందుకు మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పథకం లక్ష్యం చేరుకునేందుకు మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. ఇండ్ల నిర్మాణాలను వేగంగా ప్రారంభించేందుకు నానా పాట్లు పడుతున్నది. పెరుగుతున్న ధరలతో లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో లబ్ధిదారులకు ఊరట కలిగించే గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఇంటి నిర్మాణానికి ఇప్పటికే ఇసుకను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం.. స్టీల్, సిమెంటును సైతం తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లోనే ధరలు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లు గృహనిర్మాణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు విడుతల్లో ఇండ్లను మంజూరు చేసినప్పటికీ.. ఆకాశాన్ని తాకుతున్న ధరలతో అనుకున్న స్థాయిలో నిర్మాణాలు ప్రారంభం కాలేదు.
ఇసుక ఫ్రీ.. లక్ష లోన్
ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకూ ఇసుకను ప్రభుత్వమే అందించనుంది. అలాగే.. బేస్‌మెంట్ స్థాయి వరకు నిర్మిస్తేనే లక్ష బిల్లు ఇస్తామని చెప్పడంతో చాలా మంది వెనుకడుగు వేశారు. లక్ష వెచ్చించి ఇల్లు నిర్మాణం ప్రారంభించే పరిస్థితిలో చాలా వరకు లేరు. దాంతో వారందరి కోసం ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ మహిళా సంఘాల గ్రూపుల ద్వారా రూ.లక్ష లోన్ తీసుకునేందుకు ఆదేశాలిచ్చింది. ఈ లోన్ తీసుకొని బేస్‌మెంట్ స్థాయి వరకు నిర్మాణం పూర్తిచేసుకునే వెసులుబాటు కల్పించింది. నాలుగు దశలో రూ.5 లక్షల బిల్లులు విడుదల చేస్తామని ప్రకటించడంతో.. చివరి బిల్లు వరకు ఆ లోన్‌ను చెల్లించుకునే వెసులుబాటు లబ్ధిదారులకు దొరికింది. దాంతో ఇంటి నిర్మాణాలను ప్రారంభించేందుకు చాలా మంది లబ్ధిదారులు ముందుకొచ్చారు.
తక్కువ ధరకు స్టీల్
మార్కెట్‌లో స్టీల్, సిమెంట్ ధరలు మండిపోతున్నాయి. దాంతో చాలా మంది లబ్ధిదారులకు తలకుమించిన భారం అవుతున్నది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల నిర్మాణం అనుకున్న స్థాయిలో జరగడం లేదు. అందుకే.. ధరల భారం నుంచి లబ్ధిదారులను తప్పించేందుకు ప్రభుత్వం కొత్తగా ఆలోచన చేసింది. లబ్ధిదారులకు ఊరటనిచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, స్టీల్ ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నది. ఇప్పటికే వారితో ఒక దఫా చర్చలు ముగియగా.. నేడు మరోసారి వారితో చర్చించనున్నట్లు తెలిసింది. మార్కెట్ ధరల కన్నా తక్కువకు సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు కోరింది. నేడో రేపో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా.. ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఇటీవల పరిశ్రమల ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్, పరిశ్రమల ఇన్‌చార్జి కమిషనర్ మల్సూర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతం ఇటీవల స్టీల్, సిమెంట్ సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. నేడు మరోమారు సమావేశం కానున్నారని సమాచారం.
రూ.260కే సిమెంట్!
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో సిమెంట్ బస్తా ధర రూ.320 ఉంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం రూ.260కి సరఫరా చేయాలని అధికారులు ఆయా సంస్థల ప్రతినిధులను కోరారు. బల్క్‌గా సేల్ ఉండడంతో ఆ ధరతో సప్లై చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే.. మార్కెట్‌లో స్టీల్ టన్ను ధర రూ.50,000 నుంచి రూ.55,000 పలుకుతున్నది. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.47,000కు సరఫరా చేయాలని కోరినట్లు తెలిసింది. ఒక్కో ఇంటికి 180 సిమెంట్ బస్తాల చొప్పున ఈ ఏడాది 4 లక్షల 50 వేల ఇండ్లకు 9 మిలియన్ టన్నుల సిమెంట్, ఒక్కో ఇంటికి 1,500 కిలోల ఉక్కు చొప్పున 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరమని అధికారులు కంపెనీల ప్రతినిధులకు వివరించారు. రాబోయే 5 సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇళ్ల లక్ష్యం కావడంతో వాటన్నింటికీ సరఫరా చేసేందుకు ఈ మేరకు చర్చించారు. అంతేకాకుండా.. సోమవారం వరకు సంస్థల ప్రతిపాదనలు అందించాలని అధికారులు కోరారు. కంపెనీలు ఇచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.






