- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడబిడ్డలకు తీపి కబురు.. 21 నుంచి 30 వరకు బతుకమ్మ సంబరాలు
పూలనే పూజించే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ,..తెలంగాణలోని ఆడపడుచులకు బతుకమ్మతో విడదీయరాని బంధం పెనవేసుకుని ఉంటుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: పూలనే పూజించే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ,..తెలంగాణలోని ఆడపడుచులకు బతుకమ్మతో విడదీయరాని బంధం పెనవేసుకుని ఉంటుంది. చిన్నా పెద్దా, పేద, ధనిక తేడా లేకుండా ప్రతిఒక్క ఆడబిడ్డ పూలతో అందంగా బతుకమ్మ పేర్చి, అంతే అందంగా తానూ ముస్తాబవుతుంది. అలాంటి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఈసారి పది రోజుల పాటు జరగనుంది. సాధారణంగా తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ వేడుకలు, ఈ ఏడాది తిథి ద్వయం కారణంగా అదనంగా ఒక రోజు కొనసాగనున్నాయి. ఈ నెల 21వ తేదీన ప్రారంభమై 30వ తేదీ వరకు ఈ సంబరాలు జరగనున్నాయి. అయితే బతుకమ్మ వేడుకలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజులు, మరికొన్ని ప్రాంతాల్లో పది రోజులు వేడుకలు నిర్వహించుకుంటారు.
ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా..
ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకల ద్వారా పర్యాటక రంగానికి ప్రచారం కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు పదిరోజుల పాటు పూల పండగ నిర్వహించనుంది. ఈ వేడుకలను కాకతీయుల కాలంలో బతుకమ్మ వైభవంగా జరిగేదని చరిత్రకారులు చెబుతుంటారు. అలాంటి కాకతీయుల కళావైభవాలకు ప్రతీకగా నిలిచే రోజు హన్మకొండలోని వేయి స్తంభాల గుడిలో మొదటి రోజు బతుకమ్మ వేడుకలు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
తొమ్మిది రోజుల పండుగ..
తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ మాత్రుత్వంలోని నవమాసాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ కారణంగానే ఈ పండుగను సంతాన సాఫల్యతకు సంబంధించిన వేడుక అనికూడా అంటారు. బతుకమ్మ పండుగ అంటే తొమ్మిది రోజులు, తొమ్మిది రకాల పూలతో, తొమ్మిది రూపాల్లో అమ్మవారిని అలంకరించడం ఆనవాయితీ. కానీ, ఈ ఏడాది పండితులు, సిద్ధాంతులు చెబుతున్న దాని ప్రకారం ఈ వేడుకలు మొత్తం పది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై, చివరి రోజు సద్దుల బతుకమ్మతో పండుగ ముగుస్తుంది. తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సాయంత్రం వేళల్లో వాటి చుట్టూ తిరుగుతూ, బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేస్తారు. ఈ ఏడాది అదనంగా వచ్చిన పదవ రోజు కూడా సంబరాలు కొనసాగడం పట్ల బతుకమ్మ తెలంగాణ ఆడపడుచులకు మరొక రోజు బతుకమ్మ సంబరం జరుపుకునే అవకాశం లభించినట్లైంది.
తిథి ద్వయం చాలా అరుదు: నందకిషోరాచార్య, పురోహితులు, సిద్దాంతి
ఈ ఏడాది తిథి ద్యయం కారణంగా దసరా మహోత్సవాలు 11 రోజులు జరగనున్నాయి. ఈ అశ్వియుజ శుద్ద చవితి ఈ నెల 26, 27 తేదీల్లో రావడం కారణంగా పది రోజుల మహెత్సవాలు 11 రోజులకు పొడిగించబడ్డాయి. ఇలా రెండు తిథులు ఒకేసారి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత తిథి ద్వయం పునారావ్రుతం అయింది. అమావాస్య రోజున బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. బతుకమ్మ పండుగ దసరాకి ముందు రోజు, లేదా రెండు రోజుల ముందుగా జరుగుతుంది. ఈ ఏడాది దేవీ ఉత్సవాలు సెప్టెంబర్ 22న అశ్వయుజ శుద్ద పాడ్యమి రోజున ప్రారంభమై, అక్టోబర్ 2న అశ్వియుజ శుద్ద దశమి అయిన విజయదశమితో ముగుస్తున్నాయి.






