- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీచర్ల బదిలీలపై సస్పెన్స్.. జనగణన డ్యూటీతో చిక్కులు!
రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీలపై సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే సాధారణ బదిలీలకు అనుమతిచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో జనగణన విధుల్లో ఉన్న ఉద్యోగులను బదిలీ చేయడం కుదరదని నిబంధన విధించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీలపై సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే సాధారణ బదిలీలకు అనుమతిచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో జనగణన విధుల్లో ఉన్న ఉద్యోగులను బదిలీ చేయడం కుదరదని నిబంధన విధించింది. దీంతో టీచర్లలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ట్రాన్స్ ఫర్ చేసి జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత రిలీవ్ చేయాలని, ఆ మేరకు జీవో జారీ చేయాలని టీచర్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
జీవో నం.38 ఏం చెబుతోంది?
రాష్ట్రంలో సెన్సెస్ డ్యూటీస్ కోసం ఎక్కువ మంది టీచర్లను ఎంపిక చేశారు. వీరంతా రెండు విడతల్లో తమకు కేటాయించిన ప్రాంతాల్లో విధులు నిర్వహించాలి. జనగణన వివరాలను సేకరించాలి. ఎన్యుమరేటర్లను జనాభా లెక్కల ప్రక్రియ పూర్తయ్యే వరకు అక్కడ నుంచి బదిలీ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాటిని దృష్టిలో ఉంచుకుని సాధారణ బదిలీల కోసం అనుమతిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో నం.38 లో సెన్సెస్ డ్యూటీలో ఉన్న ఉద్యోగులకు బదిలీలు వర్తించబోదని కండిషన్ పెట్టింది. దీంతో ఈసారి టీచర్లకు సాధారణ బదిలీలు లేవని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే జనాభా లెక్కల డ్యూటీస్ లో ఉన్న టీచర్ల బదిలీలపై విద్యాశాఖ తుది నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం ఫారెన్ టూర్ లో ఉన్న సెక్రటరీ యోగితారాణా హైదరాబాద్ కు వచ్చిన తర్వాత టీచర్ల బదిలీలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.
మార్చి దాకా ఆగాల్సిందే
జనగణన లెక్కలను రెండు విడతలుగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ తయారుచేసింది. మొదటి దశ (ఏప్రిల్ 1, 2026 - సెప్టెంబర్ 30, 2026) హౌస్ లిస్టింగ్, రెండో దశలో (ఫిబ్రవరి 2027 వరకు) ఇంటింటికెళ్లి ఆ ఇంట్లో ఉంటున్న వారి వివరాలు సేకరించాలి. అంటే సెన్సెస్ ప్రక్రియ 2027 మార్చి వరకు కొనసాగుతుంది. అప్పటివరకు బదిలీలు చేయడం కుదరదు. దీంతో సెన్సెస్ డ్యూటీలో ఉన్న ఎంప్లాయిస్ ను వచ్చే ఏడాది మార్చి తర్వాత ట్రాన్స్ ఫర్ చేసేందుకు వీలుపడుతుందని అధికారవర్గాల్లో టాక్ నడుస్తున్నది. కానీ ప్రస్తుతం అనుమతి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం బదిలీ చేసి వచ్చే ఏడాది మార్చి తర్వాత జాయినింగ్ రిపోర్టు ఇచ్చేలా సడలింపులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.






