- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్టీ పోస్టుల భర్తీపై సస్పెన్స్.. రాష్ట్ర అధినాయకత్వం ప్రతిపాదనలు బుట్టదాఖలు
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. దాదాపు ఏడాది క్రితం టీపీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. దాదాపు ఏడాది క్రితం టీపీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేసింది. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ల పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. వీటిని భర్తీ చేయకపోవడంతో అసలు నియామకాలు ఉంటాయా? లేదా? అన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో్ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి ప్రతిపాదనలు పంపగా.. దానిపై ఏఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసిందని, అందుకే ఆ అంశాన్ని పక్కన పెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రపోజల్స్‌పై భిన్నాభిప్రాయాలు..
పీసీసీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్ ఉండటంతో వర్కింగ్ ప్రెసిడెంట్స్ పదవులను ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన లీడర్లకు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. అందుకోసం ఆయా వర్గాలకు చెందిన లీడర్లతో జాబితా పంపాలని ఏఐసీసీ సూచించింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక్కో సామాజిక వర్గం నుంచి ముగ్గురు లీడర్లను ఎంపిక చేసి జాబితాను ఢిల్లీకి పంపారు. అందులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ (మాజీ ఎమ్మెల్యే), ఎస్టీ నుంచి బలరాం నాయక్ (ఎంపీ), రెడ్డి వర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి(ఎంపీ) పేర్లను ఫైనల్ చేసినట్టు తెలిసింది. మైనార్టీ వర్గం నుంచి పీసీసీ పంపిన లిస్టులో ఫిరోజ్ ఖాన్, ఫహీం ఖురేషీ, అజారుద్దీన్ పేర్లు ఉన్నాయి. వీరిలో అధిష్టానం ఒకరికి సపోర్టు చేయగా.. రాష్ట్ర నేతలు మరొకరికి మద్దతు తెలుపుతున్నారని, అందుకే ఎంపిక అంశం కొలిక్కి రాలేదని సమాచారం. ఫలితంగా వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎంపికనే పెండింగ్‌లో పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది.
సమర్థులైన లీడర్లు లేకనే..
ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కాకుండా మిగతా వారిని వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా నియమించాలని ముందుగా అధిష్టానం భావించింది. కానీ అంతటి సమర్థులైన లీడర్లు లేకపోవడంతో ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చింది. కానీ పీసీసీ నుంచి వచ్చిన లిస్టులో పార్టీ కోసం పూర్తి కాలం సమయం కేటాయించే లీడర్లు లేరనే విమర్శలు ఉన్నాయి. అందుకోసం అసలు వర్కింగ్ ప్రెసిడెంట్స్ లేకుండా పార్టీ వ్యవహారాలను నడిపిస్తే ఏం అవుతుంది? అనే కోణంలోనూ అధిష్టానం అలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇబ్బందిగా ఉత్తమ్ ప్రపోజల్..
తన భార్య, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిని మహిళా కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి ప్రపోజల్ పెట్టినట్టు తెలిసింది. దానిపై రాష్ట్ర నేతల నుంచి అభ్యంతరాలు వచ్చినట్టు టాక్. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి ప్రభుత్వంలో పెద్ద సంఖ్యలో పదవులు ఇచ్చినట్లు విమర్శలున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీలోని కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పద్మావతిరెడ్డిని నియమించడం వల్ల మరిన్ని విమర్శలు వస్తాయని కొందరు అధిష్టానం వద్ద తమ వాదనను వినిపించినట్టు సమాచారం.






