హంగ్ మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న సస్పెన్స్.. కింగ్ మేకర్‌గా గులాబీ పార్టీ!

by Kema Shiva Kumar |

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 30కి పైగా స్థానాల్లో హంగ్ ఏర్పడటంతో బీఆర్ఎస్ పార్టీ 'కింగ్ మేకర్'గా మారింది. ముఖ్యంగా కామారెడ్డి వంటి కీలక మున్సిపాలిటీల్లో అధికారం కోసం బీఆర్ఎస్ ఏ పార్టీతో జతకడుతుందనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

హంగ్ మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న సస్పెన్స్.. కింగ్ మేకర్‌గా గులాబీ పార్టీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: హంగ్ స్థానాల్లో బీఆర్ఎస్ వైఖరి ఏంటి..? అన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 30కి పైగా మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితి నెలకొని ఉన్నది. ఇప్పటికే బీఆర్ఎస్ 17 మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా.. హంగ్ స్థానాల్లోనూ మరిన్ని దక్కించుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన వాటిలో.. సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం, మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి, సంగారెడ్డి జిల్లాలోని గమ్మడిదల, ఇంద్రేశం, గద్వాల జిల్లాలోని అయిజ, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్, సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, చేర్యాల, ఆమన్‌గల్, తుప్రాన్, ఎల్లంపేట, మూడుచింతలపల్లి, సంగారెడ్డి జిల్లాలోని గజ్వేల్‌ ఉన్నాయి.

కామారెడ్డిలో మద్దతు ఎటు..?

రాష్ట్రవ్యాప్తంగా 30కి మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితి ఉండడంతో ఏ పార్టీకి ఏ పార్టీ మద్దతు ఉండబోతున్నదా? అన్న అంశం ఇప్పుడు కీలకంగా మారింది. ప్రధానంగా బీజేపీతో బీఆర్ఎస్ అయినా కలవాలి.. లేదంటే కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ కలవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ కలిసే అవకాశాలు లేవని తెలుస్తున్నది. ఒకవేళ బీజేపీతో కలిసి మరిన్ని మున్సిపాలిటీలను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంటుందా? అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కామారెడ్డిలాంటి మున్సిపాలిటీలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. ఇక్కడ రెండు జాతీయ పార్టీలు కలిసే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో బీఆర్ఎస్ అయితే బీజేపీతో లేదంటే కాంగ్రెస్‌తో కలవాల్సిన పరిస్థితి ఉంది.

Next Story