Kavitha: బీఆర్ఎస్ కు కౌంటర్ ప్లాన్.. రేపు మీడియా ముందు కవిత సంచలన ప్రకటన

by Prasad Jukanti |

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం పట్ల కవిత రియాక్షన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Kavitha: బీఆర్ఎస్ కు కౌంటర్ ప్లాన్.. రేపు మీడియా ముందు కవిత సంచలన ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ ఎమ్మెల్సీ కవితను (Kavitha) బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేసీఆర్ ఆదేశాలతో కవితపై వేటు వేసినట్లు పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయంపై కవిత ఎలా స్పందిస్తారో అనేది ఉత్కంఠగా మారింది. కవితపై ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కవిత ఫోటోలను పార్టీ కార్యాలయాల నుంచి తొలగిస్తున్నారు. మరికొన్ని చోట్ల కవిత ఫ్లెక్సీలకు కాల్చి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కవిత విషయంలో కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ప్రకటనలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కవిత మాత్రం తనను సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంపై కనీసం సామాజిక మాధ్యమాల్లో కూడా స్పందించలేదు. దీంతో తాజా పరిణామాలపై ఆమె ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది.

రేపు క్లారిటీ:

జరుగుతున్న పరిణామాలను అన్ని గమనిస్తున్న కవిత రేపు మీడియా ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఇవాళ సాయంత్రమే ఆమె మీడియాతో మాట్లాడుతారని ప్రచారం జరిగింది. పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి శ్రేణులు, నాయకులు, కవిత అభిమానులు జాగృతి కార్యాలయంకు చేరుకోవడంతో ఇవాళే కవిత స్పందిస్తారని అంతా భావించారు. అయితే అమె రేపు మీడియా ముందుకు రాబోతున్నట్లు జాగృతి కార్యాలయం పేర్కొంది. ఇవాళ బీఆర్ఎస్ (BRS) నేతలు మాట్లాడే అంశాల ఆధారంగా రేపు మీడియా ముఖంగా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Next Story