Maoists Surrender: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. డీజీపీ ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగుబాటు

by Prasad Jukanti |   (  Updated:2025-11-22 12:45:58  IST  )

మావోయిస్టు కీలక నేత ఆజాద్ పోలీసులకు లొంగిపోయారు.

Maoists Surrender: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. డీజీపీ ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగుబాటు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ 37 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యడ సాంబయ్య అలియాస్ అజాద్, అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు ముచ్చకి సోమడా అలియాస్ ఎర్రాలు ఉన్నారు. మిగతా వారిలో మరో ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు, 9 మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు, 22 మంది దళ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన వారిలో వారిలో 25 మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారు. దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో కొనసాగుతూ అజ్ఞాతంలో పని చేసిన వీరంతా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలిసినట్టు డీజీపీ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో లొంగిపోయిన మావోయిస్టులతో ఇవాళ డీజీపీ శివధర్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

ఇద్దరు తెలంగాణ.. మిగతా వారంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారే..

లొంగిపోయిన వారిలో కొయ్యడ సాంబయ్య స్వస్థలం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దుల గూడెం. అప్పాసి నారాయణ పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణానికి చెందిన వారు కాగా మిగతా వారంతా ఛత్తీస్‍గఢ్‍కు చెందినవారే. లొంగిపోయిన వారిలో ఖమ్మం డివిజన్‌కు చెందిన ఏడుగురు మావోయిస్టులు తమ వద్ద ఉన్న 8 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుంచి ఏకే -47 తుపాకీ, రెండు ఎస్ఎల్ఆర్‍లు, నాలుగు .303 తుపాకులు, ఒక జీ3 తుపాకీతో పాటు వివిధ క్యాలిబర్‍లకు చెందిన 346 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన 37 మందికి తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ. 25 వేలు అందజేశారు.

ఆజాద్‌పై రూ. 20 లక్షల రివార్డు..

అజాద్‌పై రూ. 20 లక్షల రివార్డు, అప్పాసి నారాయణపై రూ. 20 లక్షల రివార్డు ఉందని డీజీపీ తెలిపారు. ఆ రివార్డు చెక్కులను ఇదే వేదికపై వారికే డీజీపీ అందజేశారు. అలాగే లొంగిపోయిన అందరిపై కలిపి రూ.1.41 కోట్ల రివార్డు ఉందని, అవి కూడా వారికి అందజేస్తామని చెప్పారు. అలాగే రివార్డుతో పాటు తెలంగాణ వారికి ప్రభుత్వం ఇస్తున్న పునరావాస ప్యాకేజీ అందిస్తామని చెప్పారు.

తెలంగాణ నుంచి సీసీలో ఐదుగురే..

తెలంగాణకు చెందిన మరో 59 మంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని, వారిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారని శివధర్‌రెడ్డి తెలిపారు. సెంట్రల్ కమిటీలో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, పాక హన్మంతు అలియాస్ ఊకె గణేశ్, పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ ఉన్నారని చెప్పారు. మిగతా వాళ్లు కూడా త్వరగా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. పోలీసుల ముందుకు వచ్చిన వారికి పూర్తి భద్రత ఉంటుందని, ఎలాంటి వేధింపులు ఉండవని హామీ ఇచ్చారు. తాజా పరిస్థితులతో మావోయిస్టు పార్టీని దేవ్‌జీ లీడ్ చేస్తున్నారని చెప్పేందుకు ఆధారాలులేవని డీజీపీ తెలిపారు.

Next Story