Supreme Court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-03 06:59:32  IST  )

ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణ ముగిసింది.

Supreme Court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణ ముగిసింది. ఈ మేరకు కేసులో పూర్తి వాదనలు విన్న జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ (Justice BR Gavai), ఆగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ల (Justice Augustine George Masihla) ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. అసెంబ్లీ సెక్రటరీ తరఫున అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi), బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం తమ వాదనలు వినిపించారు. అయితే, వాదనల సందర్భంగా ఇవాళ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు అంటూ.. ఇటీవల అసెంబ్లీ (Assembly) వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం (Aryama Sundaram) కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందుకు సంబంధించి సీఎం మాట్లాడిన ఫుటేజీని న్యాయమూర్తులకు చూపించారు. అదేవిధంగా 8 వారాల్లోగా కేసులో తుది తీర్పును వెలువరించాలని పిటిషనర్ తరఫు లాయర్ ఆర్యమా సుందరం ధర్మాసనాన్ని కోరారు.

మరోవైపు అనంతరం అభిషేక్ మను సంఘ్వీ కలుగజేసుకుని ఎమ్మెల్యే అనర్హత కేసులో సింగిల్‌ బెంచ్‌ తీర్పును కొట్టేసిన డివిజన్‌ బెంచ్‌ తీర్పు సరైందేనని మరోసారి సమర్ధించే ప్రయత్నం చేశారు. స్పీకర్‌కు గడువు విధించిన హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ (High Court Single Bench) తీర్పు సరికాదంటూ చెప్పుకొచ్చారు. స్పీకర్‌ నిర్ణయానికి కాల పరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా ఎలాంటి తీర్పులు లేవని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పందిస్తూ ‘మీ దృష్టిలో రీజనబుల్‌ టైమ్‌ అంటే ఏంటి?’ అని సింఘ్వీని ప్రశ్నించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతోందని కామెంట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉప ఎన్నికలు రావు అంటూ చేసిన వ్యాఖ్యలపై అభిషేక్‌ మనుసింఘ్వీ కోర్టుకు వివరణ ఇస్తూ.. విపక్ష నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని.. అందుకే సీఎంను అలా మట్లాడారంటూ క్లారిటీ ఇచ్చేలా ప్రయత్నం చేస్తూ వాటిని పట్టించుకోవద్దని కోర్టును అభ్యర్థించారు.

సీఎం సంయమనం పాటించాల్సిన అక్కర్లేదా.. జస్టీస్ బీఆర్ గవాయి

ఈ నేపథ్యంలనే జస్టీస్ బీఆర్ గవాయి (Justice BR Gavai) సీఎం చేసిన వ్యా్ఖ్యలపై సీరియస్ అయ్యారు. ఓ రాష్ట్రానికి సీఎంగా ఉండి కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సంయమనం పాటించాల్సి అక్కర్లేదా అని కామెంట్ చేశారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకుని ఉంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తాము కోర్టు ధిక్కార చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా..? అంటూ గంభీర వ్యాఖ్యలు చేశారు. తమకు ప్రజాస్వామ్య వ్యవస్థపై పూర్తి గౌరవం ఉందన్నారు. మిగతా రెండు వ్యవస్థల నుంచి కూడా అలాంటి గౌరవం ఉండాలని తాము కోరుకుంటున్నామని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది.

Read More: Supreme Court: సంయమనం పాటించాల్సిన అవసరం లేదా.. సీఎం రేవం‌త్‌పై సుప్రీంకోర్టు ఫైర్

Next Story