మందు తాగేటప్పుడు చికెన్ తింటున్నారా?.. ప్రాణాలకే ప్రమాదం!

by Gantepaka Srikanth |

నగరవాసుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కాసుల వేటలో పడ్డ ఓ చికెన్ సెంటర్ గుట్టును అధికారులు రట్టు చేశారు.

మందు తాగేటప్పుడు చికెన్ తింటున్నారా?.. ప్రాణాలకే ప్రమాదం!
X

దిశ, వెబ్‌డెస్క్: నగరవాసుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కాసుల వేటలో పడ్డ ఓ చికెన్ సెంటర్ గుట్టును అధికారులు రట్టు చేశారు. సికింద్రాబాద్‌లోని పార్సిగుట్ట ప్రాంతంలో ఉన్న పలు దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ మరియు జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. చాలా రోజుల నుంచి నిల్వ ఉంచిన, నాణ్యత లేని చికెన్‌ను యథేచ్ఛగా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం నాటి తనిఖీల్లో భాగంగా సుమారు 800 కిలోల నిల్వ ఉంచిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వైన్స్, బార్స్ మరియు రెస్టారెంట్లకు సరఫరా..

ఈ కుళ్లిన మాంసాన్ని కేవలం చిల్లరగా కాకుండా, నగరంలోని ప్రముఖ వైన్స్, బార్స్ మరియు రెస్టారెంట్లకు భారీగా సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. తక్కువ ధరకే వస్తుండటంతో పలు హోటల్ యాజమాన్యాలు ఈ మాంసాన్ని కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. విచారణలో మరో షాకింగ్ విషయం ఏమిటంటే, ఎలాంటి అనుమతులు లేకుండా చికెన్ షాపులు నడిపిస్తున్నట్లు తేలింది. సదరు షాపులకు సంబంధించిన లైసెన్సుల గడువు ముగిసినా, నిబంధనలకు విరుద్ధంగా కుళ్లిన మాంసం విక్రయిస్తున్నందుకు గానూ షాపులను సీజ్ చేసి, యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

అధికారుల హెచ్చరిక..

బయట హోటళ్లు, రెస్టారెంట్లలో మాంసాహారం తినేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. స్వాధీనం చేసుకున్న చికెన్‌ను జంతు ప్రదర్శనశాలలకు లేదా ఇతర పద్ధతుల్లో నాశనం చేస్తామని తెలిపారు.

Next Story