నిమ్స్‌లో చిన్నపిల్లలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం

by Malleboina Mahesh |

నిమ్స్.. అంటే ఓ నమ్మకం. దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రుల్లో ఒకటి. రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రిలో జబ్బు నయం కాని రోగానికి ఇక్కడ వైద్యం అందుతుంది.

నిమ్స్‌లో చిన్నపిల్లలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిమ్స్.. అంటే ఓ నమ్మకం. దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రుల్లో ఒకటి. రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రిలో జబ్బు నయం కాని రోగానికి ఇక్కడ వైద్యం అందుతుంది. ప్రాణాలు పోతున్న దశలోనూ నిమ్స్ కు వచ్చిన రోగిని బతికించిన సందర్భాలూ ఉన్నాయి. ఇక నుంచి త్వరలోనే చిన్నారులకు మరిన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందనున్నాయి. నిమ్స్‌లో ప్రస్తుతం అకడమిక్స్‌, ఇన్వెస్టిగేషన్‌, రీసెర్చ్‌తో పాటు 34 విభాగాలు ఉండగా.. కొత్త భవనాల నిర్మాణాలు పూర్తయితే మరో 10 సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో దేశంలో మరెక్కడా లేని విధంగా చిన్నపిల్లల వైద్యసేవలకు నిమ్స్ కొత్త బ్లాక్ వేదిక కానుంది. చిన్నారులకు జన్యుపరమైన లోపాల నుంచి గుండె, కిడ్నీ జబ్బులు, రుమటాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్, గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ, నీయోనాటాలజీ, పీడియాట్రిక్ క్రిటికల్ కేర్, పీడియాట్రిక్ సర్జరీ తదితర వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు

నిమ్స్ విస్తరణ తర్వాత అవయవ మార్పిడి వైద్య చికిత్సకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రకాల ట్రాన్స్ ప్లాంటేషన్ల కోసం నిమ్స్ ను తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. గుండె, మూత్రపిండాలు, మెదడు, కాలేయం, కేన్సర్‌, అత్యవసర విభాగం, ట్రామా, ఆర్థోపెడిక్‌ తదితర 44 విభాగాలకు సంబంధించి నూతన భవనాలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే నిమ్స్‌లో కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియో థొరాసిక్‌ సర్జరీ, వాస్కులర్‌ సర్జరీ, యూరాలజీ, రుమటాలజీ, క్రిటికల్‌ కేర్‌, డయాగ్నోస్టిక్‌ వంటి విభాగాలు ఉన్నాయి. ఆంకాలజీ విభాగంలో మెడికల్‌, సర్జికల్‌, రేడియేషన్‌ ఆంకాలజీ, క్యాథ్‌ ల్యాబ్‌, డయాలసిస్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక వైద్య విద్య విషయానికి వస్తే.. 14 స్పెషాలిటీ విభాగాలతో పాటు 23 సూపర్‌ స్పెషాలిటీల్లో పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నర్సింగ్‌, పారా మెడికల్‌, అల్లయిడ్ హెల్త్‌ సైన్సెస్‌ సంస్థలు కొనసాగుతున్నాయి. కొత్త భవనాలు అందుబాటులోకి వస్తే స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వంటి విభాగాల్లో పీజీ సీట్లు పెరగనున్నాయి.

2 వేల పడకలు అందుబాటులోకి..

నిమ్స్ కు రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. రోగుల తాకిడిని తట్టుకునేందుకు కొత్తగా నిర్మిస్తున్న రెండు వేల పడకల విస్తరణ పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి వచ్చే ఏడాది డిసెంబర్ లో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. రేవంత్‌ రెడ్డి సర్కారు నిమ్స్ విస్తరణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఎప్పటికప్పుడు విస్తరణ పనులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పనులు పూర్తయితే నిమ్స్ లో నాలుగు వేల పడకలు అందుబాటులో ఉంటాయి.

అత్యాధునిక భవన నిర్మాణం

ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో నిమ్స్‌ విస్తరణ పనులు చకచకా సాగుతున్నాయి. రూ.1,678 కోట్ల వ్యయంతో 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త భవన నిర్మాణం కొనసాగుతున్నది. ప్రస్తుతం 30 శాతం పనులు పూర్తయ్యాయి. నాలుగు బ్లాక్‌లను నిర్మిస్తున్నారు. 8 అంతస్తుల బ్లాక్‌‘ఏ’లో అవుట్‌ పేషెంట్‌ విభాగం(ఓపీడీ), 13 అంతస్తుల బీ బ్లాక్‌లో ఇన్‌పేషెంట్‌ విభాగం, 8 అంతస్తుల సీ బ్లాక్‌లో ఎమర్జెన్సీ విభాగం, 14 అంతస్తుల ‘డీ’ బ్లాక్‌లో ఐపీడీ విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. రెండు వేల ఆక్సిజన్‌ పడకలతో పాటు 120 ఓపీడీ ఛాంబర్లు, 500 ఐసీయూ పడకలు, 300 పేయింగ్‌ రూమ్‌లను నిర్మించనున్నారు. ప్రస్తుతం నిమ్స్ లో 28 ఆపరేషన్ థియేటర్లు ఉండగా, ఇప్పుడు అదనంగా 38 మాడ్యులర్‌ థియేటర్లు అందుబాటులోకి వస్తాయి. దాదాపుగా ఏడు ఫ్లోర్ల పైకప్పు పూర్తయింది. ఆలయం, మసీదు, పాఠశాలలు వంటి నిర్మాణాల పునరావాస పనులు పూర్తికావొచ్చాయి.

చిన్నారుల వైద్యానికి చిరునామా

ప్రస్తుతం నిమ్స్ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. పరికరాల కొనుగోలు, వైద్యులు, సిబ్బంది నియామకం, తదితర పనులపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. విస్తరణ తర్వాత అదనంగా మరో 10 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. కొత్త భవనం అందుబాటులోకి వచ్చాక పీడియాట్రిక్ వైద్యసేవలకు దేశంలోనే ప్రత్యేక హాస్పిటల్ గా నిమ్స్ మరనుంది. అలాగే ట్రాన్స్ ప్లాంటేషన్‌లకు సైతం ప్రాధాన్యమిస్తాం. చిన్నారుల్లో జన్యుపరమైన రోగాలకు పరిష్కారం లభిస్తుంది. పుట్టుకతో వచ్చే రోగాలకు ఇక్కడ అధునాతన వైద్యం లభిస్తుంది. నిమ్స్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే ఏడాది డిసెంబర్ 8 లోగా నిమ్స్ విస్తరణ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. : ప్రొఫెసర్ నగరి బీరప్ప, నిమ్స్‌ డైరెక్టర్‌

Next Story