ముగిసిన 2025-26 విద్యా సంవత్సరం.. రేపట్నుంచి సమ్మర్ హాలిడేస్

by Naga Rani Yarlagadda |

2025-26 విద్యా సంవత్సరం నేటితో ముగిసింది. రేపట్నుంచి 50 రోజులపాటు అన్ని స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ముగిసిన 2025-26 విద్యా సంవత్సరం.. రేపట్నుంచి సమ్మర్ హాలిడేస్
X

దిశ, వెబ్‌డెస్క్: 2025-26 విద్యా సంవత్సరం నేటితో అధికారికంగా ముగిసింది. రేపట్నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ సమ్మర్ హాలిడేస్ ప్రకటిస్తూ.. రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. 50 రోజులపాటు సమ్మర్ హాలిడేస్ కారణంగా స్కూళ్లన్నీ మూతపడనున్నాయి. తిరిగి జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా దాదాపు ఏప్రిల్ నెలాఖరు వరకూ తరగతులు జరిగేవి.. కానీ ఈ ఏడాది ఇప్పటికే ఎండల తీవ్రత 40 డిగ్రీలు దాటగా.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కాస్త ముందుగానే సెలవులు ప్రకటించింది.

వేసవి సెలవుల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు తల్లిదండ్రులకు పలు కీలక సూచనలు చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పిల్లలను మధ్యాహ్నం వేళల్లో బయటకు పంపవద్దని, ఎండలో ఆటలు ఆడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సెలవుల్లో పిల్లలను ఇంటిపట్టునే ఉంచి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, తగినంత నీరు మరియు పోషకాహారం అందించాలని సూచించారు. జూన్ 12న పాఠశాలలు తిరిగి తెరిచే సమయానికి కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Next Story