టెట్ కనీస ఉత్తీర్ణత మార్కులను తగ్గించాలి : ఎస్టీయూ టీయస్ డిమాండ్

by Ramesh Naini |

టెట్ కనీస ఉత్తీర్ణత మార్కులను తగ్గించాలి : ఎస్టీయూ టీయస్ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షలో కనీస ఉత్తీర్ణత మార్కులు అధికంగా ఉండటం వల్ల ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు పాస్ అవ్వడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్టీయూ టీయస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. సదానందం గౌడ్, జుట్టు గజేందర్ ఆవేదన చెందారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావులకు వినతి పత్రాలు అందజేశారు. పాఠశాలల్లో సుదీర్ఘ కాలంగా, సమర్థవంతంగా బోధన చేస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయ సేవా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని, ఉత్తీర్ణత మార్కులు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.

బీహార్ రాష్ట్రంలో ఉత్తీర్ణత మార్కుల తగ్గింపు..

బీహార్ రాష్ట్రంలో టెట్ ఉత్తీర్ణత మార్కులను గణనీయంగా తగ్గించారని, జనరల్, బీ.సీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వరుసగా 50, 45.5, 40 శాతంగా ఉన్నాయని గుర్తు చేశారు. ఒక వేళ తెలంగాణ రాష్ట్రంలో సవరణ సాధ్యం కాని పక్షంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సేవా కాలం ఆధారంగా సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 20 మార్కుల వరకు అదనపు వెయిటేజ్ సౌకర్యం కల్పించాలని కోరారు. దీని వల్ల అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందని సంఘం అభిప్రాయపడింది. ప్రభుత్వం ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు.

Next Story